vishal: హీరో విశాల్ కు వ్యతిరేకంగా ఏకమవుతున్న తమిళ సినీ ప్రముఖులు

  • విశాల్ ను వ్యతిరేకిస్తున్న భారతీరాజా, టి.రాజేందర్, రాధారవి తదితరులు
  • తమిళ సినీ సంఘాల్లోని పదవులు తమిళులకే ఉండాలని డిమాండ్
  • విశాల్ అవినీతికి పాల్పడుతున్నారన్న టి.రాజేందర్

తమిళ సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన హీరో విశాల్... గత మూడేళ్లుగా సంచలనాలకు కేంద్ర బిందువుగా మారాడు. తెలుగువాడైన ఈ యువ హీరో నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శిగా, తమిళ సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా సత్తా చాటుతున్నాడు. మరోవైపు, కోలీవుడ్ లో తెలుగువాడి పెత్తనాన్ని పరిశ్రమకు చెందిన ఓ వర్గం తట్టుకోలేకపోతోంది.

 ఈ నేపథ్యంలో విశాల్ స్థానికతను ఎత్తి చూపుతూ, సినీ పరిశ్రమకు చెందిన అన్ని సంఘాల్లోని పదవులు తమిళులకే దక్కాలనే కొత్త వాదనను వారు తెరపైకి తీసుకొచ్చారు. విశాల్ ను వ్యతిరేకిస్తున్న వారిలో ప్రముఖ దర్శకులు భారతీరాజా, టి.రాజేందర్, నడిగర్ సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి రాధారవి తదితరులు ఉన్నారు. వీరంతా చెన్నైలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా భారతీరాజా మాట్లాడుతూ, తమిళ నిర్మాతల సంఘం తమిళుల చేతిలోనే ఉండాలని డిమాండ్ చేశారు. దక్షిణ భారత నడిగర్ సంఘం, దక్షిణ భారత సినీ వాణిజ్య మండలి పేర్లను తమిళ నడిగర్ సంఘం, తమిళ సినీ వాణిజ్య మండలిగా మార్చాలని అన్నారు. సాధారణంగా పెద్ద సినిమాలు 200కు పైగా థియేటర్లలో మాత్రమే విడుదలవుతాయని...కానీ, విశాల్ తాజా చిత్రం 'ఇరుంబుతిరై'కి మాత్రం 300లకి పైగా థియేటర్లలో విడుదల చేసేందుకు అనుమతి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. రెండు సంఘాలకు నాయకుడిగా ఉన్న విశాల్ ఇలా చేయడం సరికాదని అన్నారు. టి.రాజేందర్ మాట్లాడుతూ, నిర్మాతల సంఘం అధ్యక్షుడిగా విశాల్ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. తన ఇష్టానుసారం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. 

More Telugu News