Andhra Pradesh: కన్నాకు పదవిపై ఆనాడే హామీ ఇచ్చిన అమిత్ షా!

  • ఏప్రిల్ 25న వైసీపీలో చేరేందుకు కన్నా నిర్ణయం
  • విషయం తెలుసుకుని ఫోన్ చేసిన అమిత్ షా
  • ఆపై వెనక్కు తగ్గిన కన్నా లక్ష్మీ నారాయణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీ నారాయణ నియామకం ఆ పార్టీలో ముసలం రేపగా, పలువురు నేతలు అధిష్ఠానం నిర్ణయాన్ని తప్పుబడుతూ రాజీనామాలు చేస్తున్నారు. ఆ పదవిని ఆశించి భంగపడిన సోము వీర్రాజు ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిపోగా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నేతలు ఇప్పటికే రాజీనామాలు చేశారు.

కాగా, బీజేపీ అధ్యక్ష బాధ్యతలను మీకే ఇస్తామని అమిత్ షా నుంచి మూడు వారాల క్రితమే కన్నాకు హామీ లభించినట్టు తెలుస్తోంది. వైఎస్ జగన్ పాదయాత్రలో ఉన్న వేళ, గత నెల 25వ తేదీన కన్నా వైసీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. బీజేపీలో చేరిన నాటినుంచి తనకు తగ్గ హోదాను ఇవ్వలేదన్న మనస్తాపంతో ఉన్న కన్నా, జగన్ వర్గంతో చర్చలు జరిపి పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకుని, తేదీ ప్రకటించారు.

ఆ విషయం తెలిసిన తరువాత అమిత్ షా స్వయంగా కన్నాకు ఫోన్ చేసి కొన్ని రోజులు వేచి చూడాలని చెబుతూ, పార్టీ అధ్యక్ష పదవిని ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. అమిత్ షా ఫోన్ కాల్ తరువాతనే వైసీపీలో చేరాలన్న తన నిర్ణయాన్ని కన్నా వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. అదే రోజున అస్వస్థతకు గురైన కన్నా ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే.

More Telugu News