Hyderabad: హైదరాబాద్‌లో రూ.25 లక్షలకు రూ.100 కోట్ల విలువైన వక్ఫ్ భూమిని అప్పగించిన అధికారి!

  • వెలుగు చూసిన భారీ భూ కుంభకోణం
  • రూ.25 లక్షలు తీసుకుని ఎన్‌వోసీ ఇచ్చిన సీఈవో
  • మధ్యవర్తికి రూ.10 లక్షలు
  • ప్రకంపనలు సృష్టిస్తున్న వ్యవహారం

హైదరాబాద్ మల్కజ్‌గిరిలోని వంద కోట్ల రూపాయల విలువైన ఐదెకరాల వక్ఫ్ భూమిని వక్ఫ్ బోర్డు అధికారి ఒకరు  రూ.25 లక్షలకు  అప్పగించేసిన   ఘటన వెలుగులోకి వచ్చింది. మే 2017లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఆదివారం బయటపడడంతో సంచలనమైంది.ఈ కుంభకోణంపై సీఐడీతో దర్యాప్తు జరపాల్సిందిగా ప్రభుత్వానికి లేఖ రాయాలని తెలంగాణ స్టేట్ వక్ఫ్ బోర్డు నిర్ణయించింది.

ఇటీవలి వరకు వక్ఫ్ బోర్డుకు సీఈవోగా వ్యవహరించిన ఎంఏ మన్నన్ ఫరూఖీ.. ఓ ప్రైవేటు వ్యక్తికి ఐదెకరాల వక్ఫ్ స్థలానికి సంబంధించి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ జారీ చేశారు. ఇందుకోసం ఆయన రూ.25 లక్షలు లంచంగా తీసుకున్నట్టు ఆరోపణలున్నాయి. ఈ డీల్ కుదిర్చిన మధ్యవర్తికి మరో పది లక్షల రూపాయలు ముట్టజెప్పినట్టు తెలుస్తోంది.

ఈ ఘటనపై నేడు బోర్డు మీటింగ్ నిర్వహించనున్నట్టు బోర్డు చైర్మన్ మహమ్మద్ సలీం తెలిపారు. అత్యవసరమైన ఈ ఫైల్‌ను ఫరూఖీ ఎవరికీ పంపలేదని, తన వద్దకు కూడా అది రాలేదని సలీం తెలిపారు. ఈ భూ కుంభకోణంపై అబిడ్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ స్కామ్‌పై ఏసీబీతో దర్యాప్తు జరపాల్సిందిగా కోరనున్నట్టు తెలిపారు. అలాగే 1956 నుంచి జారీ అయిన అన్ని నో అబ్జెక్షన్ సర్టిఫికెట్‌లపైనా సీఐడీతో దర్యాప్తు జరిపించాల్సిందిగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు లేఖ రాయనున్నట్టు సలీం వివరించారు.

More Telugu News