Andhra Pradesh: ప్రకాశం జిల్లాలో విషాదం.. రైలు కింద పడి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి ఆత్మహత్య

  • మృతుల్లో నలుగురు ముక్కుపచ్చలారని చిన్నారులు
  • కడప జిల్లా బద్వేలుకు చెందిన వారిగా గుర్తింపు
  • ఆత్మహత్యకు గల కారణాలను ఆరా తీస్తున్న పోలీసులు

ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సంఘమిత్ర రైలు కింద పడి కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. జిల్లాలోని ఉలవపాడు రైల్వేస్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మొత్తం ఆరుగురు ఆత్మహత్యకు పాల్పడగా అందులో నలుగురు ముక్కుపచ్చలారని చిన్నారులు ఉండడం హృదయాలను ద్రవించి వేస్తోంది. మృతులను కడప జిల్లా బద్వేల్‌కు చెందిన పాశం సునీల్ (27), రమ(22), ఉష(5), కల్యాణ్‌(3), కల్యాణి(3), 8నెలల చిన్నారిగా రైల్వే పోలీసులు గుర్తించారు. వీరిలో కల్యాణ్-కల్యాణి కవలలు.  

పోలీసుల కథనం ప్రకారం.. సునీల్-రమ దంపతులు వాయిదాల పద్ధతిపై మిక్సీలు, గ్రైండర్లు ఇచ్చే వ్యాపారం చేస్తున్నారు. ఈనెల 9న బంధువుల ఇంట్లో వివాహం కోసం కందుకూరు కృష్ణబలిజపాలెం చేరుకున్నారు. అక్కడ దంపతుల మధ్య చిన్నపాటి గొడవ జరిగినట్టు సమాచారం. పెళ్లి నుంచి ఇంటికి వెళ్తూ ఆదివారం మధ్యాహ్నం ఉలవపాడు రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ స్టేషన్‌కు రాగానే దాని కింద పడి అందరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఘటన కారణంగా స్టేషన్‌లో రైలును 20 నిమిషాల పాటు నిలిపివేశారు. ఇది ప్రమాదం కాదని, ఆత్మహత్యేనని స్టేషన్ మాస్టర్ తెలిపారు.

More Telugu News