mahanati: అందుకే, ఈ పాత్ర చేయడానికి ముందు ఎంతో సందేహించాను: ‘మహానటి’ గురించి కీర్తిసురేశ్

  • తెలుగు ప్రేక్షకులు మహానటి సావిత్రిని దేవతలా కొలుస్తారు
  • అటువంటి పాత్రను పోషించాలంటే మొదట్లో ఎంతో సందేహించా 
  • అయితే, సవాల్ గా తీసుకుని ఆ పాత్ర చేశాను

‘మహానటి’లో కీర్తిసురేశ్ చేసిన సావిత్రి పాత్రకు ఆమెపై ప్రశంసలు కురుస్తున్న విషయం తెలిసిందే. కీర్తి నటన అద్భుతమంటూ పలువురు సినీప్రముఖులు అభినందిస్తున్నారు. ఈ తరుణంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తెలుగు ప్రేక్షకులు మహానటి సావిత్రిని దేవతలా కొలుస్తారని, అటువంటి పాత్రను తాను పోషించడానికి ముందు ఎంతో సందేహించానని చెప్పింది. అయితే, సవాల్ గా తీసుకుని ఆ పాత్రలో నటించానని, ఈ పాత్ర కోసం తాను బరువు పెరగలేదని, నిజం చెప్పాలంటే, సావిత్రి చిన్ననాటి పాత్ర కోసం కొంచెం బరువు తగ్గాల్సి వచ్చిందని పేర్కొంది.

సావిత్రి పెద్దయ్యాక చేసిన పాత్రలను తాను పోషించేందుకు ప్రోస్థటిక్ పద్ధతిలో తనకు మేకప్ వేసేవారని, మూడు గంటల సమయం పట్టేదని చెప్పింది. ఆ మేకప్ ను తిరిగి తీసి వేసేందుకు మరో మూడు గంటల సమయం కేటాయించాల్సి వచ్చేదని చెప్పిన కీర్తి సురేశ్, కేవలం తన కనుబొమ్మలను తీర్చిదిద్దేందుకే అరగంట సమయం పట్టేదని గుర్తుచేసుకుంది. ఈ మేకప్ వేసే మూడు గంటలూ ఏదన్నా తిందామన్నా నోరు తెరిచేందుకు వీలుండేది కాదని చెప్పిన కీర్తి సురేశ్, సెట్స్ పైకి వెళ్లగానే ఆ కష్టమంతా మర్చిపోయి పాత్రపై, నటనపై దృష్టి పెట్టేదానినంటూ చెప్పుకొచ్చింది.

More Telugu News