Karnataka elections: ఎగ్జిట్ పోల్స్ వినోదం కోసమే... వాటిని చూసి ఆందోళన చెందకండి: సిద్ధరామయ్య

  • సగటు గణాంకాలపై ఆధారపడే పోల్స్ అవి
  • విజయంపై ధీమా
  • ఈ మేరకు ట్విట్టర్లో పోస్టింగ్

కర్ణాటక రాష్ట్రంలో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాదని, హంగ్ ఏర్పడుతుందంటూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ప్రకటించినప్పటికీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఏ మాత్రం కలవరం చెందడం లేదు. వాటిని పూచిక పుల్లతో సమానంగా తీసిపడేశారు. ఆ రాష్ట్రంలో 225 అసెంబ్లీ స్థానాలు ఉండగా, అధికారం ఏర్పాటుకు కావాల్సిన 113 మార్కును ఏ పార్టీ చేరుకోలేదని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన విషయం విదితమే. వీటిపై సిద్ధరామయ్య ఈ ఉదయం ట్విట్టర్లో స్పందించారు. రెండు రోజుల పాటు వినోదం పంచేవిగా ఎగ్జిట్ పోల్స్ ను అభివర్ణించారు. వీటిని చూసి ఆందోళన చెందక్కర్లేదని పార్టీ శ్రేణులకు సూచించారు.

‘‘ఎగ్జిట్ పోల్స్ రెండు రోజుల పాటు వినోదం పంచేవి. ఒక నది సగటున 4 అడుగుల లోతు ఉందంటూ ఓ గణాంకకుడు చెప్పిన వివరాల ఆధారంగా ఓ వ్యక్తి ఆ నదిలో నడుచుకుంటూ వెళ్లడం అసాధ్యం. ఎగ్జిట్ పోల్స్ సైతం ఈ తరహా గణాంకాలపైనే ఆధారపడతాయి. కనుక ప్రియమైన పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు, శ్రేయోభిలాషులు ఎగ్జిట్ పోల్స్ గురించి ఆందోళన చెందకండి’’ అంటూ సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. విజయంపై ధీమాను వ్యక్తం చేశారు.

More Telugu News