amitsha: అమిత్ షా కాన్వాయ్ పై దాడి ఘటనలో టీడీపీ నేత అరెస్ట్, విడుదల

  • టీడీపీ నేత సుబ్రహ్మణ్యంయాదవ్ ని అరెస్టు చేసి విడుదల చేశాం
  • బీజేపీ నేతలు దాడికి పాల్పడ్డ దృశ్యాలను పరిశీలిస్తున్నాం
  • తిరుపతి డీఎస్పీ మునిరామయ్య

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్ పై దాడి ఘటనలో టీడీపీ నేత సుబ్రహ్మణ్యంయాదవ్ ని పోలీసులు అరెస్టు చేసి, వెంటనే బెయిల్ పై విడుదల చేశారు. ఈ సందర్భంగా తిరుపతి డీఎస్పీ మునిరామయ్య మాట్లాడుతూ, ఈ ఘటనపై టీడీపీ, బీజేపీ నేతల నుంచి తమకు ఫిర్యాదులు అందాయని, సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించామని చెప్పారు.

ఈ ఘటనలో దాడికి పాల్పడిన సుబ్రహ్మణ్యం యాదవ్ ను అరెస్టు చేశామని, ఆపై బెయిల్ పై విడుదల చేశామని, ఈ ఘటనకు సంబంధించి టీడీపీ నేతలు చేసిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. అలాగే, టీడీపీ నేతలపై బీజేపీ నేతలు దాడికి పాల్పడ్డ దృశ్యాలను పరిశీలిస్తున్నామని అన్నారు.

కాగా, ఈరోజు అర్ధరాత్రి నుంచి అలిపిరి పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించిన టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ ఘటనలో తమ ఫిర్యాదును పట్టించుకోలేదని ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా చైర్మన్ నర్సింహయాదవ్ నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ నేతలను కాకుండా టీడీపీ నేతలను అరెస్టు చేయడం సబబు కాదంటూ మండిపడ్డారు. బీజేపీ నేతలను తక్షణం అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే, పోలీసుల హామీతో టీడీపీ నేతలు తమ ఆందోళన విరమించారు.

More Telugu News