Hyderabad: ఇకపై మా నాన్న మద్యం తాగడన్న విద్యార్థిని.. సస్పెన్షన్ ఎత్తివేసిన కమిషనర్ అంజనీకుమార్

  • విధుల్లో ఉండగా మద్యం తాగిన కానిస్టేబుల్
  • సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు
  • ఇకపై మద్యం తాగబోడంటూ కుమార్తె హామీ
  • ఫిదా అయిన సీపీ అంజనీకుమార్

హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ వాట్సాప్‌లో షేర్ చేసిన ఓ వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. అంతగా వైరల్ అయిన ఆ మెసేజ్ లో ఏముందంటే.. మద్యం తాగి విధులకు వచ్చిన ఓ కానిస్టేబుల్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి ఆ కానిస్టేబుల్ తాగుడుకు మరింతగా అలవాటయ్యాడు. ఉద్యోగం పోయిందన్న దిగులుతో మరింతగా తాగుతున్నాడు. ఇది గమనించిన తొమ్మిదో తరగతి చదువుతున్న అతడి కుమార్తె తండ్రికి తిరిగి ఉద్యోగం ఇప్పించాలి, ఆ బాధ నుంచి అతడిని బయటపడేయాలని నిర్ణయించింది.

అనుకున్నదే తడవుగా కమిషనర్ అంజనీకుమార్‌కు ఫోన్ చేసి అపాయింట్‌మెంట్ కోరింది. ఆయన సరేననడంతో తల్లితో కలిసి కమిషనర్ కార్యాలయంలో కలిసింది. విధుల్లో ఉండగా తాగినందుకు తన తండ్రిని సస్పెండ్ చేశారంటూ నాటి ఘటనను వివరించింది. తప్పు చేసిన వారికి క్షమాపణ ఉంటుంది కాబట్టి తన తండ్రిని క్షమించాలని, ఇకపై తన తండ్రితో సహా కుటుంబంలో ఎవరూ మందు ముట్టకుండా చూసే బాధ్యత తనదని హామీ ఇచ్చింది.

సస్పెండైన దగ్గరి నుంచి దిగులుతో మరింతగా తాగుతున్నాడని, కొన్ని రోజులుగా దీనిని గమనిస్తున్నానని, ఉద్యోగం వస్తే మళ్లీ మామూలుగా అవుతాడని అనిపించి ఈ హామీ ఇస్తున్నానని బాలిక చెప్పిన మాటలకు అంజనీకుమార్ ముగ్ధుడయ్యారు. వెంటనే అతడిని ఉద్యోగంలోకి తీసుకుంటున్నట్టు ఉత్తర్వులు తయారుచేయించి స్వీట్స్‌తోపాటు ఉత్తర్వులను బాలిక ఇంటికి పంపి ఆశ్చర్యపరిచారు. కొన్ని రోజుల క్రితం జరిగిన ఈ ఘటనను వాట్సాప్ ద్వారా కమిషనర్ పంచుకోవడంతో వైరల్ అయింది.

More Telugu News