walmart: ఫ్లిప్ కార్ట్ ను వాల్ మార్ట్ కొనడం వినియోగదారులకు వరం... మరింత తక్కువ ధరలకే మొబైల్స్!

  • మార్కెట్ వాటా కోసం పోటీ
  • కస్టమర్లను ఆకర్షించేందుకు భారీ డిస్కౌంట్లు
  • విశ్లేషకుల అంచనాలు

ఫ్లిప్ కార్ట్ లో 77 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్టు అమెరికాకు చెందిన వాల్ మార్ట్ ప్రకటించిన నేపథ్యంలో ఈ డీల్ వినియోగదారులకూ మేలు చేస్తుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అమెరికాకు చెందిన అమేజాన్ ఇండియాతో వాల్ మార్ట్ పోటీపడనుంది. మరింత మార్కెట్ షేరును సొంతం చేసుకునేందుకు ఫ్లిప్ కార్ట్ వేదికగా భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేయవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.

మొబైల్ ఫోన్లు ఈ కామర్స్ సంస్థలకు పెద్ద మొత్తంలో ఆదాయ వనరుగా ఉన్నాయి. వాల్ మార్ట్ ప్రపంచంలోనే అగ్రగామి రిటైల్ కంపెనీ. కస్టమర్లను నిలబెట్టుకునేందుకు, కొత్త కస్టమర్లను సొంతం చేసుకునేందుకు అమేజాన్, వాల్ మార్ట్-ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తాయని సైబర్ మీడియా రీసెర్చ్ కు చెందిన ప్రభురామ్ అభిప్రాయపడ్డారు.

ఫ్లిప్ కార్ట్, అమేజాన్ ఈ రెండింటికీ స్మార్ట్ ఫోన్లు ప్రస్తుతం పెద్ద మొత్తంలో ఆదాయం తెచ్చిపెడుతున్నాయి. ఫ్లిప్ కార్ట్ కు నాలుగింట మూడొంతులు మొబైల్స్ విభాగం నుంచే వస్తోంది. విక్రయాలు మరింత పెంచుకునేందుకు ఈ రెండు సంస్థలు ఈ నెల 13 నుంచి 16 వరకు భారీ డిస్కౌంట్లతో విక్రయ మేళాను కూడా నిర్వహిస్తున్నాయి. నో కాస్ట్ ఈఎంఐ, క్యాష్ బ్యాక్ ఆఫర్లతో అధిక విక్రయాలపై కన్నేశాయి.

More Telugu News