ATS: నరేంద్ర మోదీని హత్య చేసేందుకు కుట్ర.. ఛార్జ్ షీట్ లో పేర్కొన్న ఏటీఎస్!

  • అనుమానిత ఉగ్రవాదుల విచారణలో వెల్లడి
  • స్నిప్పర్ రైఫిల్ తో కాల్చాలని కుట్ర
  • చార్జ్ షీట్ లో వెల్లడించిన గుజరాత్ ఏటీఎస్

తమకు పట్టుబడిన ఇద్దరు అనుమానిత ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను విచారించిన గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్), ప్రధాని నరేంద్ర మోదీని హత్య చేయాలని వారు కుట్ర పన్నినట్టు తన చార్జ్ షీట్ లో పేర్కొంది. మోదీని ఓ స్నిప్పర్ రైఫిల్ తో కాల్చేయాలని ఉబెద్ అహ్మద్ మీర్జా, తన అనుచరుడికి ఫోన్లో సూచించాడని ఏటీఎస్ పేర్కొంది. ఈ ఫోన్ సంభాషణ గత సంవత్సరం అక్టోబర్ లో జరిగిందని, మీర్జాతో పాటు మొహమ్మద్ ఖాసిన్ ను అరెస్ట్ చేశామని బారుచ్ జిల్లాలోని అంకాలేశ్వర్ కోర్టుకు సమర్పించిన చార్జ్ షీట్ లో అధికారులు పేర్కొన్నారు. వీరిద్దరి మధ్యా వాట్స్ యాప్ చాటింగ్ కూడా జరిగిందని, ఫిస్టల్ కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేశారని పేర్కొంది.

"అవును... మోదీని స్నిప్పర్ రైఫిల్ తో చంపేద్దాం... ఇన్షా అల్లా" అని వీరు మాట్లాడుతున్నారని తెలిపింది. ఇందుకోసం రష్యాలో తయారైన గన్ కావాలని మీర్జా కోరాడని వెల్లడించింది. మరో వాట్స్ యాప్ చాట్ లో భారతీయులపై విచక్షణా రహితంగా దాడులు చేయాలని అందుకు కత్తులు వాడాలని ఉన్నట్టు విచారణ అధికారులు వెల్లడించారు. బాంబులు, పేలుడు పదార్థాలు వాడకుండా, ఇండియాలోని విదేశీయులను టార్గెట్ చేసుకోవాలని వారికి పైనుంచి ఆదేశాలు వచ్చినట్టు తెలిపారు.

More Telugu News