జూబ్లీహిల్స్ చెక్‌పోస్టులో అర్ధరాత్రి హడలెత్తించిన యువతి

11-05-2018 Fri 08:58
  • అడ్డదిడ్డంగా డ్రైవింగ్
  • స్కూటీని ఢీకొట్టి బోల్తా
  • పోలీసుల అదుపులో యువతి
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌‌ ప్రమాదాలకు అడ్డాగా మారుతోంది. స్థల మహత్యమో, ఏమో కానీ అక్కడికి రాగానే వాహనదారులు రెచ్చిపోతున్నారు. ప్రమాదాలు నిత్యకృత్యమైన ఈ ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి ఓ మహిళ కారుతో బీభత్సం సృష్టించింది. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు మీదుగా ఫిల్మ్‌నగర్ వెళ్తూ ర్యాష్ డ్రైవింగ్‌తో తోటి ప్రయాణికుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది.

ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే ఓ స్కూటీని ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో స్కూటీపై  వెళ్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువతిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.