vote for note: 'ఓటుకు నోటు' కంటే 'ఫోన్ ట్యాపింగ్' పెద్ద కేసు: సీపీఐ నారాయణ

  • కేసీఆర్, చంద్రబాబులు కేసులను ఎలా ఎదుర్కోవాలా? అనే ఆలోచిస్తున్నారు
  • జగన్ మీద ఎన్నో అవినీతి కేసులు ఉన్నాయి
  • అవినీతిపరులకు మోదీ కొమ్ముకాస్తున్నారు

ఓటుకు నోటు కేసును తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించడం రెండు తెలుగు రాష్ట్రాల్లో వేడిని పెంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందిస్తూ... ఓటుకు నోటు కేసు కంటే ఫోన్ ట్యాపింగ్ పెద్ద నేరమని చెప్పారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబులు ఫోన్ ట్యాపింగ్, ఓటుకు నోటు కేసులను ఎలా ఎదుర్కోవాలో సమావేశాలు పెట్టి మరీ ఆలోచిస్తున్నారని విమర్శించారు. వైసీపీ అధినేత జగన్ మీద ఎన్నో అవినీతి కేసులున్నాయని దుయ్యబట్టారు. నయీం బతికి ఉంటే అమిత్ షా ఎప్పుడో ఊచలు లెక్కబెట్టేవారని చెప్పారు.

మోదీ, అమిత్ షా చెప్పుచేతుల్లో కేసీఆర్ ఉన్నారని... ఫెడరల్ ఫ్రంట్ పేరుతో మోసపూరిత వైఖరిని ప్రదర్శిస్తున్నారని నారాయణ ఆరోపించారు. మోదీ ప్రభుత్వం ఆర్థిక నేరస్తులను, మైనింగ్ మాఫియాను కాపాడేందుకు యత్నిస్తోందని మండిపడ్డారు. అవినీతిపరులకు అండగా ఉంటూ, తనను వ్యతిరేకిస్తున్న వారిని భయపెట్టి, దారికి తెచ్చుకునేందుకు మోదీ యత్నిస్తున్నారని అన్నారు. మోదీకి దమ్ముంటే అమిత్ షా, చంద్రబాబు, కేసీఆర్, జగన్ లను జైలుకు పంపాలని సవాల్ విసిరారు. 

More Telugu News