Rajanikant: చనిపోయే ముందు నా లక్ష్యమిదే: రజనీకాంత్

  • నదుల అనుసంధానమే లక్ష్యం
  • గంగానదిని చూసేందుకే హిమాలయాలకు
  • 'కాలా' పాటల పండగలో రజనీకాంత్

దక్షిణ భారతదేశంలో ఉన్న నదులన్నింటినీ అనుసంధానం చేయడమే తన ప్రధాన లక్ష్యమని, ఈ పని ముగిసిన తరువాత చనిపోయినా ఫర్వాలేదని సూపర్ స్టార్ రజనీకాంత్ వ్యాఖ్యానించారు. గత రాత్రి ఆయన తాజా చిత్రం 'కాలా' పాటల పండగ జరుగగా, మాట్లాడిన రజనీకాంత్, డైరెక్టుగా రాజకీయాలపై మాట్లాడకపోయినా, రాజకీయాలను ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

తాను తరచూ హిమాలయాలకు వెళ్లడానికి కారణమేంటని చాలా మంది అడుగుతూ ఉంటారని చెప్పిన ఆయన, గంగానది రౌద్రాన్ని, అందాన్ని చూడటానికే తాను హిమాలయాలకు వెళ్లి వస్తుంటానని అన్నారు. ఈ ఫంక్షన్ ఆడియో వేడుకలా లేదని, సినిమా విజయోత్సవ సభలా అనిపిస్తోందని చెప్పారు.

'శివాజీ' సక్సెస్ మీట్ కు అతిథిగా వచ్చిన కరుణానిధి చెప్పిన మాటలు తనకు ఇంకా వినిపిస్తున్నాయని, ఆయన మాట కోసం తాను కూడా అందరిలో ఒకడిగా ఎదురు చూస్తున్నానని అన్నారు. వర్షం, కార్మికుల సమ్మె కారణంగా సినిమా చిత్రీకరణకు కొన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ, రంజిత్ అనుకున్న దానికన్నా బాగా తీశారని, ఈ సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉందని చెప్పారు.

More Telugu News