Amaravati: ఇంకో 106 ఎకరాలు కావాలి... ఎకరానికి కోటి రూపాయలు ఇద్దాం: చంద్రబాబు

  • అమరావతి ప్రాంతంలో జక్కంపూడి ఎకనామిక్ టౌన్ షిప్
  • కోటి రూపాయలతో పాటు ఇంటికో ఉద్యోగం కూడా
  • అధికారులు వెంటనే రంగంలోకి దిగాలి
  • కలెక్టర్ల సదస్సులో చంద్రబాబునాయుడు

నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంలో జెట్ సిటీ (జక్కంపూడి ఎకనామిక్‌ టౌన్‌ షిప్‌)ని విస్తరించేందుకు మరో 106.48 ఎకరాలు కావాల్సి వుందని, ఇందుకోసం రైతుల నుంచి భూ సమీకరణ చేయాలని, భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చేవారికి తక్షణ పరిహారంగా ఎకరాకు కోటి రూపాయలతో పాటు ఇంటికో ఉద్యోగం చొప్పున ఎకనామిక్ సిటీలో ఉద్యోగం ఇస్తామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు.

అమరావతిలో జరిగిన రెండో రోజు కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న ఆయన, జెట్ సిటీపై కీలక ప్రకటన చేశారు. ఎకనామిక్ సిటీ పక్కనే ఈ భూమి కావాల్సి వుంటుందని చెప్పిన ఆయన, ప్రభుత్వ పరిహారం మెరుగైనదే అయినా, మార్కెట్ ధర కన్నా తక్కువగా ఉన్నందున భూముల యజమానులు బాధపడకుండా ఉండేందుకే ఉద్యోగం ప్రతిపాదన చేస్తున్నామని చంద్రబాబు అన్నారు. తక్షణమే అధికారులు రంగంలోకి దిగి భూ సమీకరణ ప్రక్రియ ప్రారంభించాలని తెలిపారు.

ఈ సదస్సులో ఆర్థిక రాజధాని ప్రస్తావనకు వచ్చిన వేళ, విజయవాడకు వాయవ్య దిశలో ఉన్న జక్కంపూడి ప్రతిపాదనకు వచ్చింది. ఇక్కడ నిర్మించిన హౌసింగ్ టౌన్ షిప్ లో ప్రస్తుతం 36 వేల మంది ఉంటున్నారు. ఇక జెట్ సిటీ విస్తరణకు నున్నలో 60 ఎకరాల ప్రభుత్వ భూమి, 40 ఎకరాల ప్రైవేటు భూమి ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. ఈ సమీపంలోని భూములను భూ సేకరణ పద్ధతిలో తీసుకోవాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఇక ఈ భూమిలో పేద, మధ్య, ఎగువ మధ్య, ధనిక వర్గాలు నివసించేందుకు వీలుగా నాలుగు లేదా ఐదు కేటగిరీల్లో ఇళ్లను నిర్మించాలని కూడా చంద్రబాబు ఆదేశించారు.

More Telugu News