Daggubati Abhiram: నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు కుమారుడు అభిరామ్‌కు బెదిరింపులు

  • అభిరామ్ ఫోన్‌ను తస్కరించిన దుండగులు
  • అందులోని ఫొటోలు, వీడియోలను బయటపెడతామని బెదిరింపు
  • రూ.కోటిన్నర చెల్లించాలని డిమాండ్
  • నిందితులకు అరదండాలు

టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు కుమారుడు అభిరామ్‌ ఫోన్‌ను తస్కరించిన కొందరు బ్లాక్ మెయిలింగ్‌కు దిగారు. ఆ ఫోన్‌లో ఉన్న ఫొటోలను బయటపెట్టకుండా ఉండాలంటే రూ.1.5 కోట్లు చెల్లించాలంటూ ఈ-మెయిల్ చేయడం కలకలం రేపింది. అయితే, పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో నిందితులు ప్రస్తుతం ఊచలు లెక్కపెట్టుకుంటున్నారు.

వారం రోజుల క్రితమే ఈ ఘటన జరగ్గా తాజాగా పోలీసులు బయటపెట్టారు.
అభిరామ్ ఫోన్‌ను తస్కరించి క్యాష్ చేసుకోవాలని భావించిన నలుగురు నిందితులు పథకం ప్రకారం ఓ రెస్టారెంట్‌లో అభిరామ్ ఐఫోన్‌ను చాకచక్యంగా దొంగిలించారు. ఫోన్ పాస్‌వర్డ్ కనుగొని అందులోని ఫొటోలు, వీడియోలను చూశారు. వాటిని బూచిగా చూపి డబ్బు సంపాదించాలని ప్లాన్ వేశారు. అందులో భాగంగా ఓ ఈ-మెయిల్ ఐడీని క్రియేట్ చేసి దాని ద్వారా బ్లాక్‌మెయిలింగ్‌కు దిగారు. గత నెల 24న అభిరామ్‌కు మెయిల్ చేస్తూ.. ఫోన్‌లో ఉన్న ఫొటోలు, వీడియోలను బయట పెట్టకుండా ఉండాలంటే రూ.1.5 కోట్లు చెల్లించాలని, లేదంటే వాటిని సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు.

బెదిరింపు ఈ-మెయిల్‌పై సురేశ్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ-మెయిల్ ఆధారంగా నిందితులను గుర్తించారు. పశ్చిమగోదావరి జిల్లా నేలమర్రుకు చెందిన కె.రఘురామవర్మ, అదే జిల్లా భీమవరానికి చెందిన ఎన్.కార్తీక్, నేలమర్రుకే చెందిన తిరుమలశెట్టి నాగవెంకటసాయి, పశ్చిమగోదావరి జిల్లా పెందుర్రుకు చెందిన పి.చంద్రకిశోర్‌లను అరెస్ట్ చేశారు. కాగా, అభిరామ్ ఫోన్‌లో ఉన్న ఏ ఫొటోలు, వీడియోలను చూపించి వీరు బ్లాక్ మెయిల్ చేశారనే విషయాన్ని పోలీసులు వెల్లడించలేదు. గతంలో ఓ నటితో అభిరామ్ సన్నిహితంగా ఉన్న ఫొటోలు సోషల్ మీడియకెక్కి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
 

More Telugu News