chicken: అమాంతం పెరిగిపోతోన్న కోడి మాంసం ధర.. నోరూరుతున్నా తినలేకపోతోన్న చికెన్‌ ప్రియులు!

  • ప్రతికూల వాతావరణంతో కోళ్ల మృత్యువాత
  • మరోవైపు పెళ్లిళ్ల సీజన్
  • విపరీతంగా పెరిగిన డిమాండ్
  • స్కిన్‌లెస్‌ కోడి మాంసం ధర సుమారు రూ.240 

భోజన ప్రియులైన భారతీయులకి చికెన్‌ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ వారు మరీ ఇష్టంగా లాగించే కోడి కూర ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఆదివారం రోజున చికెన్‌ లేనిదే చాలా మందికి ముద్దదిగదు. మరోవైపు రెండు వారాల నుంచి చికెన్ ధరలు పైపైకి ఎగుస్తూ వస్తున్నాయి. కొన్ని రోజుల నుంచి వడగాడ్పుల తీవ్రత ఎక్కువగా ఉంటూనే మరోవైపు అకాల వర్షాలు పడుతోన్న విషయం తెలిసిందే.

దీంతో కోళ్లు మృత్యువాత పడుతుండడంతో కోడి మాసం ధర పెరిగిపోతోంది. ప్రస్తుతం స్కిన్‌లెస్‌ కోడి మాంసం ధర రూ.220 నుంచి 240 మధ్యలో ఉండగా, 15 రోజుల క్రితం ఈ ధర రూ.180గా ఉండేది. ఓ వైపు ప్రతికూల వాతావరణంతో కోళ్లు చనిపోవడం, బరువు తగ్గిపోతోంటే, మరోవైపు ఇది పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో కోడి మాంసానికి విపరీతంగా డిమాండ్ ఉంటోంది.

అందుకే కోడి మాంసం ధరలకు రెక్కలు వస్తున్నాయి. దీనికి తోడు ఈ నెల 17 నుంచి రంజాన్ మాసం ప్రారంభం అవుతుంది. దీంతో డిమాండ్‌ మరింత పెరిగి రేట్లు కూడా అదే స్థాయిలో జోరందుకుంటూనే ఉండే అవకాశం ఉంది. తినాలని నోరూరుతున్నా అంత ధర చెల్లించలేక చికెన్‌ ప్రియులు కొంత కాలం దానికి దూరంగా ఉండాల్సిందే.          

More Telugu News