ఇక్కడ జబర్దస్త్ లాంటి షోలు నడవవు: రోజాపై మంత్రి ఆదినారాయణరెడ్డి విమర్శలు

09-05-2018 Wed 14:25
  • ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి గురించి ఎలా పడితే అలా మాట్లాడరాదు
  • రాజకీయాలను రోజా వదిలేయాలి
  • సినిమాలు, సీరియళ్లు చేసుకోవాలి

వైసీపీ ఎమ్మెల్యే రోజాపై మంత్రి ఆదినారాయణరెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రిపై ఆమె చేసిన ఆరోపణలను తప్పుబట్టారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి గురించి ఎలా పడితే అలా మాట్లాడటం సంస్కారం కాదని అన్నారు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. రాజకీయాలలో జబర్దస్త్ లాంటి కార్యక్రమాలు నడవవని ఎద్దేవా చేశారు.

రోజా చేసేది ఎంటర్ టైన్ మెంట్ అని, తాము స్వచ్ఛమైన రాజకీయం చేస్తామని ఎద్దేవా చేశారు. రోజాకు ఎప్పుడూ ఒకటే ఆట, ఒకటే పాట అంటూ విమర్శించారు. రాజకీయాలను రోజా వదిలేయాలని... హాయిగా సినిమాలు, టీవీ షోలు, సీరియల్స్ చేసుకోవాలని సూచించారు. వైసీపీ అధినేత జగన్ నోరు విప్పితే అన్నీ అబద్ధాలేనని మంత్రి విమర్శించారు. జగన్ మళ్లీ జైలుకు వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు.