Chandrababu: సీఎం చంద్రబాబు శ్రీరాముడు.. కలెక్టర్లేమో ఆంజనేయులు!: సీనియర్ ఐఏఎస్ అధికారి చమత్కృతి

  • చంద్రబాబును రాముడితో పోల్చిన పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి
  • ఆయన పేరు తలచుకోగానే లక్ష్యాలు చిన్నవైపోతున్నాయని వ్యాఖ్య
  • హాయిగా నవ్వుకున్న కలెక్టర్లు, ఉన్నతాధికారులు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని శ్రీరాముడిగా, కలెక్టర్లను ఆయన భక్తుడైన ఆంజనేయులుగా అభివర్ణించారు పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి రామాంజనేయులు. మంగళవారం నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ.. చేసిన వ్యాఖ్యలతో సీఎం, కలెక్టర్లు, ఉన్నతాధికారులు సహా అందరూ హాయిగా నవ్వుకున్నారు.  రామాంజనేయులు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చాక ఎన్నడూ లేని విధంగా ఓడీఎఫ్ (ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ) సాధించామని పేర్కొన్న ఆయన చిత్తూరు కలెక్టర్ ప్రద్యుమ్నను ప్రశంసించారు. జిల్లాలో భారీ సంఖ్యలో వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించారని తెలిపారు.

లంకలో బందీ అయిన సీత జాడను కనుగొనేందుకు సముద్రం దాటాల్సి వచ్చినప్పుడు హనుమంతుడు తొలుత భయపడ్డాడని, సముద్రం దాటగలనా అని సంకోచించాడని రామాంజనేయులు పేర్కొన్నారు. అయితే, మనసులో ఒకసారి రాముడిని తలచుకోగానే అనుమానం పటాపంచలై, ఆత్మవిశ్వాసం పెరిగిందని, ఫలితంగా సముద్రాన్ని అలవోకగా దాటేశాడని పేర్కొన్నారు. ఇప్పుడు అలాగే, ముఖ్యమంత్రి చంద్రబాబు పేరు తలచుకోగానే కలెక్టర్లకు లక్ష్యం చిన్నదైపోతోందని, చాలా సులభంగా లక్ష్యాన్ని అధిగమిస్తున్నారని చమత్కరించడంతో సమావేశంలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి.

More Telugu News