vote for note: ఓటుకు నోటు కేసును నీరుగార్చవద్దు!: కేసీఆర్ కు బీజేపీ విన్నపం

  • కేసీఆర్ కు ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి ఆంజనేయరెడ్డి విన్నపం
  • చంద్రబాబు వాయిస్ కు సంబంధించిన ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టును బయటపెట్టండి
  • అశోక్ బాబును వెంటనే ఉద్యోగం నుంచి తొలగించండి

ఓటుకు నోటు కేసును నీరుగార్చవద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి ఆంజనేయరెడ్డి విన్నవించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వాయిస్ కు సంబంధించిన ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టును ప్రజలకు వెల్లడించాలని కోరారు. ఫెడరల్ ఫ్రంట్ కోసం దేశం మొత్తం తిరుగుతున్న కేసీఆర్... ఓటుకు నోటు కేసును పక్కన పెట్టే ప్రయత్నం చేయరాదని సూచించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.

ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు ధోరణి విపరీత స్థాయికి చేరుకుందని ఆంజనేయరెడ్డి మండిపడ్డారు. ఉద్యోగ విధులను గాలికి వదిలేసి, రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అశోక్ బాబు కర్ణాటకకు వెళ్లి ఎన్నికల ప్రచారం చేస్తున్నారని... దీని వెనుక చంద్రబాబు హస్తం ఉందా? అని ప్రశ్నించారు. ఆయనపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

తెలుగు డ్రామా పార్టీగా టీడీపీ మారిపోయిందని ఆంజనేయరెడ్డి ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వంపై ఏపీ ప్రభుత్వం కొత్త డ్రామా మొదలు పెట్టిందని, చంద్రబాబు నాటకాలను ఏపీ ప్రజలు నమ్మబోరని అన్నారు. 

More Telugu News