BJP: కర్ణాటకలో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచేది కాంగ్రెస్సే: శివసేన ఎంపీ

  • పరిపాలనను గాలికొదిలిన బీజేపీ
  • ఎన్నికల తరువాత కళ్లు తెరచుకుంటాయి
  • శివసేన ఎంపీ సంజయ్ రౌత్

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం అధిక స్థానాలను గెలుచుకోవడంతో ఆగిపోదని స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని స్థాపిస్తుందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో విజయం కోసం బీజేపీ, పరిపాలనను గాలికొదిలి తన యంత్రాంగాన్నంతా కర్ణాటకపై పెట్టిందని ఆయన ఆరోపించారు. మహారాష్ట్రలో త్వరలో జరిగే కౌన్సిల్ ఎన్నికల్లో శివసేన, బీజేపీ పొత్తు విషయాన్ని ప్రస్తావిస్తూ, రాష్ట్ర ఎన్నికల్లో పొత్తు ఉన్న మాత్రాన, 2019లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో రెండు పార్టీలూ కలసి పోటీ చేస్తాయని భావించరాదని వ్యాఖ్యానించారు.

ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా, మొత్తం పార్టీ జాతీయ నేతలను రంగంలోకి దించడం బీజేపీకి పరిపాటిగా మారిందని ఆయన అన్నారు. ఈ ఎన్నికలను దేశమంతా ఆసక్తిగా చూస్తున్నాయని, అందుకు బీజేపీ చేస్తున్న హడావుడే కారణమని ఆరోపించిన ఆయన, ఎన్నికల తరువాత బీజేపీ కళ్లు తెరచుకుంటాయని వ్యాఖ్యానించారు. వివిధ రకాల నేరాలతో అట్టుడుకుతున్న యూపీలో పరిస్థితిని చక్కదిద్దాల్సిన సీఎం యోగి ఆధిత్యనాథ్, తన విధులను వదిలేసి కర్ణాటకకు రావడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో దుమ్ము తుపాను బీభత్సం సృష్టిస్తుంటే బాధితులకు అండగా ఉండకుండా, పార్టీ ప్రయోజనాల కోసం ఆయన రాష్ట్రాన్ని వదిలేశారని నిప్పులు చెరిగారు.

More Telugu News