Uttar Pradesh: సమాజ్‌ వాది పార్టీతో పొత్తుపై అతి త్వరలోనే ప్రకటన!: మాయావతి

  • ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది
  • సీట్ల పంపకంపై చర్చలు సాగుతున్నాయి
  • ఖరారు కాగానే అధికారిక ప్రకటన

వచ్చే సంవత్సరం జరగనున్న లోక్‌ సభ ఎన్నికల్లో సమాజ్‌ వాది పార్టీతో పొత్తు పెట్టుకునే అంశంపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేస్తామని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. ఇరు పార్టీల మధ్యా పొత్తుపై చాలాకాలంగా చర్చలు సాగుతున్నాయని, రెండు పార్టీల మధ్యా సీట్ల పంపకంపై నిర్ణయం తీసుకున్నాక ప్రకటన వెలువరుస్తామని ఆమె స్పష్టం చేశారు.

పార్లమెంట్ ఎన్నికలకు ఇంకా చాలినంత సమయం ఉన్నందున ఈ విషయంలో తొందరపడాలని భావించడం లేదని ఆమె అన్నారు. కర్ణాటకలో జేడీ (యస్) తరఫున ప్రచారం చేసేందుకు తాను వెళ్లనున్నట్టు ఆమె తెలిపారు. కన్నడ ప్రజలు ఎవరూ ఊహించని తీర్పు ఇవ్వనున్నారని అంచనా వేసిన ఆమె, కేంద్రంపై ఆధిపత్యాన్ని చూపే అవకాశం తమకు కర్ణాటక నుంచే లభిస్తుందన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు.

కాగా, యూపీలో అసెంబ్లీ ఎన్నికల తరువాత గోరఖ్ పూర్ ఎంపీగా ఉన్న ఆదిత్యనాథ్ ను సీఎం పదవి వరించగా, ఫుల్ పూర్ ఎంపీ కేశవ్ ప్రధాన్ మౌర్యాను ఉప ముఖ్యమంత్రి పదవి వరించిన సంగతి తెలిసిందే. ఆపై గోరఖ్ పూర్, ఫుల్ పూర్ లకు ఉప ఎన్నికలు జరుగగా, అనూహ్య రీతిలో అధికార పార్టీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. ఎస్పీ, బీఎస్పీ పొత్తు విజయవంతం కాగా, భవిష్యత్తులోనూ అదే విధమైన పొత్తుతో బీజేపీని నిలువరించాలని పార్టీల అధినేతలు భావిస్తున్నారు.

More Telugu News