Hyderabad: నచ్చావు, పెళ్లాడుతానంటూ హైదరాబాద్ యువతికి రూ. 7 లక్షల టోకరా!

  • వివాహ సంబంధం కోసం ప్రొఫైల్ పెట్టిన యువతి
  • డాక్టర్ నని పరిచయం చేసుకున్న వ్యక్తి
  • డాలర్లు పంపుతున్నానంటూ మోసం

ఒక వివాహ సంబంధాల వెబ్ సైట్ లో యువతి ప్రొఫైల్ చూసి పరిచయం పెంచుకున్న వ్యక్తి, రూ. 7 లక్షలకు టోకరా వేసిన ఘటన హైదరాబాద్ లో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఓ ప్రైవేటు హాస్పిటల్ లో మేనేజర్ గా పని చేస్తున్న బాధితురాలు జీవన్ సాథీ వెబ్ సైట్ లో తనకు తగిన వరుడు కావాలంటూ ప్రొఫైల్ పెట్టింది. దీన్ని చూసిన ఓ వ్యక్తి, తాను ఐరాస తరఫున యమన్ లో డాక్టర్ గా పని చేస్తున్నానని పరిచయం అయ్యాడు. తాను భారతీయుడినని, విదేశాల్లోనే చదువుకున్నానని నమ్మించాడు. ప్రొఫైల్ బాగుందని, పెళ్లాడతానని మాయమాటలు చెప్పాడు. కొన్నాళ్ల చాటింగ్ తరువాత, ఫోన్ నంబర్లు ఇచ్చి పుచ్చుకుని, వాట్స్ యాప్ చాటింగ్ ల వరకూ పరిచయం వెళ్లింది.

ఈ క్రమంలో తాను ఇండియాకు వచ్చేందుకు నిర్ణయించుకుని పదవీ విరమణ చేశానని, మొత్తం 4.5 లక్షల డాలర్లు డబ్బు వచ్చిందని, వీటిని ఇండియాకు పంపేస్తున్నానని చెప్పాడు. డబ్బును సేఫ్ లాకర్ లో ఉంచానని, తాళం చెవులను తన స్నేహితుడు రోజర్ బెకరీతో ఇండియాకు పంపుతున్నానని చెప్పాడు. ఆపై రెండు రోజులకు తాను ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి ఫోన్ చేస్తున్నానని రోజర్ అనే వ్యక్తి ఫోన్ చేసి, తాను లాకర్ ను బయటకు తేవాలంటే కస్టమ్స్ సుంకాలు కట్టాలంటూ ఒత్తిడి తెస్తున్నారని ఫోన్ చేశాడు. తన ఖాతాలో రూ. 1.30 లక్షలు వేస్తే, లాకర్ తెచ్చి అప్పగిస్తానని నమ్మబలికాడు.

ఆ డబ్బును డిపాజిట్ చేసిన కాసేపటికే, స్కానింగ్ లో డాలర్లు, డబ్బులు ఉండటాన్ని చూసిన అధికారులు, ఇలా నేరుగా డబ్బు తేకూడదని అంటున్నారని, మరో రూ. 3.75 లక్షలిస్తే వదిలేస్తారని చెప్పగా ఆ డబ్బు కూడా డిపాజిట్ చేసింది. మరికాసేపటికి యాంటీ టెర్రరిస్టు సర్టిఫికెట్ లేదని అధికారులు తిరకాసు పెడుతున్నారని, ఇంకో రూ. 3.5 లక్షలు వేయాలని అడిగితే, ఇక తన వద్ద లేవని చేతులెత్తేసింది. ఆపై కనీసం రూ. 2 లక్షలిస్తే మిగిలిన మొత్తం తాను సర్దుకుంటానని చెబితే నమ్మి నిండా మునిగింది.

ఆపై ఎయిర్ పోర్టు నుంచి బయటకు వచ్చానని, లాకర్ నిండుగా డబ్బుందని, దాన్ని హైదరాబాద్ కు తెస్తానని చెబుతూ, విమానం టికెట్ కోసమని మరో రూ. 25 వేలు నొక్కేసిన ఆ వ్యక్తి, ఆపై సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశాడు. తాను మోసపోయానని గుర్తించిన బాధితురాలి ఫిర్యాదు మేరకు సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

More Telugu News