indrakaran: అవినీతి అధికారుల‌పై చ‌ర్య‌ల‌కు తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ఆదేశం

  • ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న బాసర ఆల‌య అధికారుల‌పై చర్యలు
  • ఆరుగురు ఈవోల‌కు చార్జీ మెమోలు జారీ
  • రెండు నెల‌ల్లో విచార‌ణ పూర్తి చేయాలి
  • ఆరోప‌ణ‌లు రుజువైతే కఠిన చ‌ర్య‌లు

అత్యంత ప‌విత్ర‌మైన ఆల‌యాల్లో అవినీతి, అక్ర‌మాలకు పాల్పడే దేవాదాయ శాఖ‌ ఉద్యోగులు, సిబ్బందిపై కఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని తెలంగాణ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి హెచ్చ‌రించారు. ఇప్ప‌టికే విచార‌ణ పూర్తయి ఆరోప‌ణ‌లు రుజువైన వారిపై శాఖా ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు. దేవాదాయ శాఖ‌పై మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఈ రోజు హైదరాబాద్‌లోని తెలంగాణ స‌చివాలయంలో సమీక్ష నిర్వహించారు.

మంత్రి ఛాంబ‌ర్ లో జరిగిన‌ ఈ సమావేశంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి శివ శంకర్, అదనపు కమిషనర్ శ్రీనివాస రావు, జాయింట్ కమిషనర్ కృష్ణవేణి, ఆయా జిల్లాల సహాయక కమిషనర్ లు పాల్గొన్నారు. దేవాల‌యాల్లో ఆన్ లైన్ సేవ‌లు, ధూప దీప నైవేద్యాలు, కామ‌న్ గుడ్ ఫండ్, ప్ర‌త్యేక అభివృద్ధి నిధులు ప్ర‌ధాన ఎజెండాగా స‌మావేశంలో చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా బాస‌ర స‌ర‌స్వ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో గ‌త మూడేళ్ల‌లో ప‌ని చేసిన ఆరుగురు ఈవోలు విధుల్లో నిర్ల‌క్ష్యం వ‌హించిన‌ట్లు విచార‌ణ‌లో తేల‌డంతో వారికి చార్జీ మెమోలు జారీ చేసిన‌ట్లు దేవాదాయ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి శివ‌శంక‌ర్ మంత్రికి తెలిపారు.

బాస‌ర ఆల‌యంలో ప‌ని చేస్తూ  ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న మిగ‌తా సిబ్బందికి కూడా వారం రోజుల్లో ఛార్జీ మెమోలు జారీ చేయాలని ఆల‌య ఈవోను మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఆదేశించారు. నిధులు దుర్వినియోగం చేసిన సిబ్బంది నుంచే ఆ సొమ్మును వ‌సూలు చేయాల‌న్నారు. బాస‌ర స‌ర‌స్వ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో అక్ర‌మాల‌పై వివిధ ప‌త్రిక‌లు, న్యూస్ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చిన క‌థ‌నాల‌పై స్పందించిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఇటీవల విచార‌ణ‌కు ఆదేశించారు.

మంత్రి ఆదేశాల మేర‌కు దేవాదాయ శాఖ జాయింట్ క‌మిష‌న‌ర్ కృష్ణ‌వేణి విచార‌ణ జ‌రిపి, నివేదిక స‌మ‌ర్పించారు. మ‌రోవైపు రాష్ట్రంలోని మిగితా ఆల‌యాల్లో ప‌ని చేస్తూ, అవినీతి ఆరోప‌ణలు ఎదుర్కొంటున్న ఆల‌య అధికారులు, సిబ్బందిపై రెండు నెల‌ల్లో విచార‌ణ పూర్తి చేసి నివేదిక‌ను స‌మ‌ర్పించాల‌ని మంత్రి ఆదేశించారు. విచారణలో అవినీతి ఆరోపణలు రుజువైన అధికారులపై శాఖ‌ప‌రమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

దేవాల‌యాల్లో ఆన్ లైన్ సేవ‌ల‌ను విస్త‌రించాలి..
రాష్ట్రంలోని ప్ర‌ధాన ఆల‌యాల‌తో పాటు గ్రేట‌ర్ హైద‌‌రాబాద్ ప‌రిధిలో ఉన్న దేవాల‌యాల్లో ఆన్‌లైన్‌ సేవ‌ల‌ను త్వ‌రిత‌గ‌తిన అందుబాటులోకి తీసుకురావాల‌ని ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ లోని గ‌ణేశ్ ఆల‌యంలో ప్ర‌స్తుతం ప్ర‌యోగాత్మ‌కంగా ఆన్ లైన్ సేవ‌ల‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ నెల‌ఖారులోగా పూర్తిస్థాయిలో ఆన్ లైన్ సేవ‌ల‌ను అందుబాటులోకి తేవాల‌ని దేవాదాయ శాఖ అధికారుల‌ను మంత్రి ఆదేశించారు.

త‌రువాత రాష్ట్రంలోని 8 ప్ర‌ధాన ఆల‌యాల‌కు దీన్ని విస్త‌రించాల‌న్నారు. ఆన్ లైన్ సేవ‌ల‌ను అందుబాటులోకి తీసుకురావ‌డం వ‌ల్ల భ‌క్తుల‌కు సౌక‌ర్య‌వంతంగా ఉండ‌టంతో పాటు ఆల‌యాల్లో పార‌ద‌ర్శ‌క‌త పెరిగి, ఆదాయం కూడా పెరుగుతుంద‌ని చెప్పారు.

పేప‌ర్ లెస్ కార్యాల‌యంగా దేవాదాయ శాఖ
జూన్ 1 నుంచి ఈ-ఆఫీస్ విధానం అమలు

ఫైళ్ల జాడ కనుక్కోవడానికే కాదు వాటిని సత్వరం పరిష్కరించడానికి ఇకపై దేవాదాయ శాఖ ప్ర‌ధాన‌ కార్యాలయంలో ఈ-ఆఫీసు విధానాన్ని అమ‌లు చేయాల‌ని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ఈ ఏడాది జూన్ 1 నుంచి  ఫైళ్ల ప‌రిష్కారానికి ఆన్ లైన్ ట్రాకింగ్ వ్య‌వ‌స్థ‌ను అందుబాటులోకి తీసుకురావాల‌ని అధికారుల‌కు సూచించారు. దీనికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను ఐటీఈసీ శాఖ‌ రూపొందిస్తోంది.

ఆల‌యాల‌కు ధూప దీప నైవేద్య ప‌థ‌కం
జూన్ 1 నుంచి మ‌రిన్ని ఆల‌యాల‌కు ధూప దీప నైవేద్య ప‌థ‌కం వ‌ర్తించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ఇప్ప‌టికే వ‌చ్చిన ద‌రఖాస్తుల‌ను మ‌రోసారి క్షుణ్ణంగా ప‌రిశీలించాల‌ని సూచించారు. దేవాదాయ శాఖ చ‌ట్టంలోని నిబంధ‌న‌ల‌కు లోబ‌డి అర్హ‌మైన ఆల‌యాల‌కు మాత్ర‌మే ఈ ప‌థ‌కాన్ని వ‌ర్తింప‌జేసేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు 5289 ద‌రఖాస్తులు వ‌చ్చిన‌ట్లు అధికారులు తెలిపారు. పూర్తి స్థాయి ప్ర‌క్రియ పూర్త‌య్యేందుకు స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉన్నందున జూన్ 1 నుంచి మొద‌టి విడ‌త‌లో కొన్ని ఆల‌యాల‌కు ధూప దీప ప‌థ‌కం వ‌ర్తింపజేయాల‌న్నారు. కొన్ని ఆల‌యాల్లో అర్చ‌కులుగా ప‌ని చేస్తున్న విశ్వ బ్రాహ్మ‌ణుల‌తో పాటు గిరిజ‌న ఆల‌య పూజారుల‌కు కూడా ధూప దీప నైవేద్య ప‌థ‌కాన్ని వ‌ర్తింప‌జేయ‌నున్నారు.

ఆల‌యాభివృద్ధి ప‌నులు మ‌రింత వేగ‌వంతం
ప్ర‌త్యేక అభివృద్ధి నిధి ద్వారా  8 ఆల‌యాల్లో రూ.55.60 కోట్ల‌తో చేప‌ట్టిన ఆల‌యాభివృద్ది ప‌నుల‌ను వేగ‌వంతం చేయాల‌ని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఆదేశించారు. ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రం బాస‌ర స‌ర‌స్వ‌తి అమ్మ‌వారి ఆల‌య అభివృద్ధి ప‌నుల ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఆల‌యాభివృద్దిపై  ప్ర‌ణాళిక‌ను రూపొందించి, మాస్ట‌ర్ ప్లాన్ ను సిద్ధం చేయాల‌న్నారు.

మాస్ట‌ర్ ప్లాన్ రూపొందించిన త‌రువాత సీఎం కేసీఆర్‌ని సంప్ర‌దించి ఆల‌యాభివృద్ధి ప‌నుల‌ను చేపడ‌తామ‌ని మంత్రి తెలిపారు. బాస‌ర ఆల‌యాభివృద్ధికి సీఎం కేసీఆర్ ఇప్పటికే రూ.50 కోట్ల నిధులు కేటాయించారని, బాస‌ర పుణ్య‌క్షేత్రానికి వ‌చ్చే భ‌క్తుల‌కు ఎలాంటి నీటి కొర‌త లేకుండా చూడాల‌ని ఆల‌య ఈవోను మంత్రి ఆదేశించారు.

More Telugu News