Gujarath: మరో దారుణం.. గుజరాత్ లో చిన్నారిపై అత్యాచారం.. ఆపై హత్య?

  • మోర్బీ జిల్లాలో సంఘటన
  • ఫ్యాక్టరీలో పని చేస్తున్న వలస కార్మికుల కుటుంబం
  • ఆ కుటుంబానికి చెందిన రెండేళ్ల చిన్నారిపై  అత్యాచారం

మరో చిన్నారిని అత్యాచారం చేసి, ఆపై హత్య చేసిన సంఘటన గుజరాత్ రాష్ట్రంలో వెలుగుచూసింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రాథమిక సమాచారం వివరాలు .. గుజరాత్ లోని మోర్బీ జిల్లాలో సిరామిక్  టైల్స్ ఫ్యాక్టరీలో పని చేసే నిమిత్తం వలస కార్మికుల కుటుంబాలు అక్కడికి వచ్చాయి. వాటిలో ఒక కుటుంబం సదరు ఫ్యాక్టరీ కేటాయించిన గదులలో నివసిస్తోంది. ఈ కుటుంబానికి చెందిన రెండేళ్ల చిన్నారి బుధవారం రాత్రి నుంచి కనిపించకుండా పోయింది. 

ఈ క్రమంలో జెట్పార్ రోడ్డుకు సమీపంలోని ఓ కాలువ వద్ద ఈ చిన్నారి మృతదేహాన్ని నిన్న అర్ధరాత్రి  గుర్తించినట్టు పోలీసులు చెప్పారు. పోస్టుమార్టమ్ రిపోర్టు వచ్చిన తర్వాతే చిన్నారి మృతికి గల కారణాలు కచ్చితంగా చెప్పగలమని ఓ పోలీస్ అధికారి చెప్పారు. కాగా, మోర్బీ టౌన్ ఇండస్ట్రియల్ ప్రాంతం. ఇక్కడ అధిక శాతం సిరామిక్ టైల్స్ ఫ్యాక్టరీలు, గడియారాల ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉన్నాయి. గడియారాల ఇండస్ట్రీస్ లో పని చేసేందుకు స్థానికులను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. సిరామిక్స్ టైల్స్ ఫ్యాక్టరీలో పనులకు మాత్రం వలస కార్మికులను తీసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే వలస కార్మిక కుటుంబాలు ఇక్కడికి వచ్చి పనిచేస్తుంటాయి.

More Telugu News