తెలుగుదేశం పార్టీని వీడనున్న ఆర్.కృష్ణయ్య!

04-05-2018 Fri 08:14
  • చంద్రబాబుపై ఆగ్రహంతో ఉన్న బీసీ సంఘాల నేత
  • బీసీల విషయంలో చులకన భావంతో ఉన్నారని అభిప్రాయం
  • పార్టీ వీడితేనే మేలంటున్న కృష్ణయ్య
బడుగు, బలహీన సంఘాల నేత, ఎల్బీనగర్ టీడీపీ ఎమ్మెల్యే రాగ్య కృష్ణయ్య అతి త్వరలోనే తెలుగుదేశం పార్టీని వీడనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఏపీలో తాను గౌరవ అధ్యక్షుడిగా ఉన్న ఓ ఉద్యోగ సంఘానికి అధికారిక గుర్తింపు ఇవ్వకుండా చంద్రబాబు ప్రభుత్వం నిరాకరించిందన్న ఆగ్రహంతో ఉన్న ఆయన, తాను ఆ పదవి నుంచి వైదొలగితే వెంటనే గుర్తింపు ఇస్తామంటూ ప్రభుత్వం మెలిక పెడుతోందని మండిపడుతున్నట్టు ఆయన అనుచరులు చెబుతున్నారు. ఏపీలో వెనుకబడిన తరగతుల ప్రజల విషయంలో చంద్రబాబు చులకన భావంతో ఉన్నారని అభిప్రాయపడుతున్న ఆయన, అదే విషయాన్ని తన సన్నిహితుల వద్ద ప్రస్తావిస్తూ, ఇక పార్టీ వీడితేనే మేలని భావిస్తున్నట్టు చెబుతున్నారట.

2014 ఎన్నికలకు ముందు, తెలంగాణలో టీడీపీ అధికారంలోకి వస్తే కృష్ణయ్యకు సీఎం పదవిని ఇస్తానని చెప్పిన చంద్రబాబు, పార్టీ శాసనసభాపక్ష నేత హోదా ఆయనకు ఇవ్వలేదన్న సంగతి తెలిసిందే. దీంతో అప్పటి నుంచే చంద్రబాబుపై నిశ్శబ్ద యుద్ధం చేస్తున్న కృష్ణయ్య, పేరుకు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ, ఏ కార్యక్రమంలోనూ పచ్చచొక్కా ధరించలేదు. బీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్, రాజ్యాధికారంలో వాటా, తదితరాల విషయంలో మిగతా ప్రభుత్వాల మాదిరే చంద్రబాబు కూడా వ్యవహరిస్తున్నారన్న ఆగ్రహం కృష్ణయ్యలో ఉన్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి. టీడీపీని కృష్ణయ్య వీడుతున్నారన్న విషయమై అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.