Australia: ఆసీస్ కొత్త కోచ్ గా జస్టిన్ లాంగర్

  • ఈ నెల 22 నుంచి కోచ్ బాధ్యతలు స్వీకరించనున్న లాంగర్
  • నాలుగేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతాడు
  • ఇంగ్లాండ్ పర్యటనతో ప్రారంభం కానున్న లాంగర్ ప్రస్థానం  

దక్షిణాఫ్రికాతో ఇటీవల జరిగిన టెస్టు సిరీస్ లో ఆస్ట్రేలియా జట్టు బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడటం తెలిసిందే. ఈ వ్యవహారంలో ఆసీస్ క్రీడాకారులు క్రాఫ్ట్ పై ఎనిమిది నెలలు, స్మిత్, వార్నర్ లపై ఏడాది చొప్పున నిషేధం విధించారు. ప్రధాన కోచ్ డారెన్ లీమన్  తన పదవికి రాజీనామా చేయడం విదితమే. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు కొత్త కోచ్ గా నలభై ఏడేళ్ల జస్టిన్ లాంగర్ ను ఎంపిక చేశారు.

ఈ నెల 22 నుంచి కోచ్ బాధ్యతలు స్వీకరించనున్న లాంగర్ నాలుగేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఇంగ్లాండ్ పర్యటనతో ఆస్ట్రేలియా కొత్త కోచ్ గా లాంగర్ వ్యవహరించనున్నాడు. కాగా, ఆస్ట్రేలియా జట్టు తరఫున దాదాపు ఇరవై ఏళ్ల పాటు లాంగర్ క్రికెట్ ఆడాడు. 2007లో ఆస్ట్రేలియా 5-0తో యాషెస్ సిరీస్ నెగ్గిన అనంతరం అంతర్జాతీయ క్రికెట్ నుంచి లాంగర్ తప్పుకున్నాడు. వెస్ట్రన్ ఆస్ట్రేలియా, పెర్త్ స్కార్చర్స్ ట్వంటీ 20 జట్లకు ప్రధాన కోచ్ బాధ్యతలను లాంగర్ నిర్వర్తించాడు.

More Telugu News