galla aruna: ఇన్ ఛార్జి బాధ్యతల నుంచి వైదొలగిన గల్లా అరుణ!

  • వయోభారం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నానన్న అరుణ
  • పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం లేదని మధనపడుతున్న అరుణ వర్గీయులు
  • అమరనాథరెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంతో.. అసంతృప్తికి గురైన అరుణ

మాజీ మంత్రి, ఎంపీ గల్లా జయదేవ్ తల్లి గల్లా అరుణకుమారి చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జి బాధ్యతల నుంచి వైదొలిగారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని, తన కుమార్తెను కానీ మరొకరిని కానీ బరిలోకి దింపే ఆలోచన కూడా లేదని ఆమె స్పష్టం చేశారు. చంద్రబాబును స్వయంగా కలిసి ఈ విషయాన్ని ఆయనకు తెలియజేశానని చెప్పారు. వయోభారం కారణంగానే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

మరోవైపు, పార్టీలో సరైన ప్రాధాన్యత ఇవ్వడంలేదని గల్ల అరుణ వర్గీయులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. అరుణ కుటుంబానికి సుదీర్ఘ రాజకీయ అనుభవం, అంగబలం, అర్థబలం ఉన్నప్పటికీ గుర్తింపు ఇవ్వడం లేదని మధనపడుతున్నారు. ఈ నేపథ్యంలో, తన అనుచరుల నుంచి అరుణ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారట.

రెండున్నరేళ్ల క్రితం ఎమ్మెల్సీ స్థానాన్ని అరుణ ఆశించినప్పటికీ... ఆ స్థానాన్ని గాలి ముద్దు కృష్ణమనాయుడికి ఇచ్చారు. అప్పటి నుంచి ఆమె అసంతృప్తికి లోనవుతున్నారని చెబుతున్నారు. మరోవైపు, వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన అమరనాథరెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంతో ఆమె అసంతృప్తి మరింత ఎక్కువైందని సమాచారం. ఈ నేపథ్యంలోనే, ఆమె ఇన్ ఛార్జి బాధ్యతల నుంచి వైదొలిగారని చెబుతున్నారు. 

More Telugu News