Tamilnadu: నా చావు నీ తాగుడు మాన్పిస్తే అదే పదివేలు.. తలకొరివి పెట్టేందుకు తాగి రావద్దు!: లేఖ రాసి చనిపోయిన కుమారుడు

  • తండ్రితో తాగుడు మాన్పించేందుకు తనువు చాలించిన కుమారుడు
  • తండ్రితోపాటు సీఎం, పీఎంకు కూడా లేఖ
  • సంపూర్ణ మద్య నిషేధం అమలు చేయాలని వేడుకోలు
  • మీరు చేయకుంటే తన ఆత్మ చేస్తుందని హెచ్చరిక

తాగుడుకు బానిసైన తండ్రికి ఆత్మహత్య చేసుకునే ముందు కుమారుడు రాసిన లేఖ హృదయాలను పిండేస్తోంది. లేఖ చదివిన వారు అప్రయత్నంగానే కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పాషాణ హృదయాలను సైతం కరిగించే ఆ లేఖలో .. ‘‘ నాన్నా.. నా చావు నీలో మార్పు తీసుకురావాలి. తాగుడు మానేసెయ్. నాకు తలకొరివి పెట్టేటప్పుడైనా కనీసం తాగకుండా ఉండేందుకు ప్రయత్నించు. తాగుతానంటే మాత్రం రావద్దు. తాగి అంత్యక్రియలు చేస్తే నా ఆత్మ క్షోభిస్తుంది’’  అంటూ రాశాడు.

అంతేకాదు.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సైతం తన లేఖలో ప్రశ్నించాడు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న మద్యం షాపులన్నింటినీ మూసివేయాలని కోరాడు. ప్రభుత్వాలు ఆ పనిచేయకుంటే తన ఆత్మే ఆ పని చేస్తుందని హెచ్చరించాడు.

హృదయవిదారకమైన ఈ ఘటన తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా గురుకుల్ పట్టిలో జరిగింది. గ్రామానికి చెందిన మాడసామి, ఈశాకి దినేశ్ నల్ల శివన్ (17) అనే కుమారుడున్నాడు. 9 ఏళ్ల క్రితం ఈశా మరణించడంతో మాడసామి మరో వివాహం చేసుకున్నాడు. ఇంటర్ పూర్తి చేసిన నల్ల వివన్ ‘నీట్’కు సిద్ధమవుతున్నాడు. తాగుడుకు బానిసైన తండ్రిని ఆ అలవాటు మానేయమని చాలాసార్లు ప్రాధేయపడ్డాడు. అయినా ఫలితం లేకుండా పోయింది. రోజూ తాగి రావడం.. ఇరుగుపొరుగు వారితో గొడవ పడడం అలవాటుగా మారిపోయింది. దీంతో, ఇక తండ్రితో తాగుడు మాన్పించలేననుకున్న శివన్ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన చావుతోనైనా తండ్రి మారితే అదే పదివేలనుకున్నాడు. బుధవారం తెల్లవారుజామున రైల్వే బ్రిడ్జికి ఉరేసుకుని ప్రాణం తీసుకున్నాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. శివన్ జేబులోంచి తండ్రికి, ముఖ్యమంత్రికి, ప్రధానికి రాసిన మూడు వేర్వేరు లేఖలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టు మార్టానికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News