దేవెగౌడను ప్రశంసించిన మోదీ.. చర్చనీయాంశంగా మారిన ప్రధాని వ్యాఖ్యలు!

02-05-2018 Wed 19:15
  • కర్ణాటక ఎన్నికల ప్రచారంలో మోదీ
  • దేవెగౌడ అంటే తనకెంతో గౌరవమని వ్యాఖ్య
  • స్పందించిన దేవెగౌడ
బీజేపీ తరఫున కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొంటోన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవెగౌడపై ప్రశంసలు కురిపించారు. దేవెగౌడ అంటే తనకెంతో గౌరవమని వ్యాఖ్యానించిన మోదీ.. ఆయన ఢిల్లీకి వచ్చినప్పుడల్లా ఎదురెళ్లి మరీ స్వాగతం పలుకుతానని అన్నారు. దీంతో మోదీ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

ఈ విషయంపై స్పందించిన దేవెగౌడ మీడియాతో మాట్లాడుతూ.. మోదీ పొగడడంతో తమకి, బీజేపీకి 'పొత్తు' ఉంటుందని అర్థం చేసుకోవద్దని చెప్పారు. కన్నడ ప్రజల గౌరవాన్ని సిద్ధరామయ్య ఏ విధంగా దిగజార్చుతున్నారో చెబుతూ, ఒక కన్నడ వ్యక్తి ప్రధాని అయ్యారని మోదీ గుర్తుచేశారని ఆయన అన్నారు. అంతమాత్రన దాని అర్థం 'పొత్తు' ఉంటుందని కాదని పేర్కొన్నారు.

అలాగే, ఇటీవల సిద్ధరామయ్య తనపై చేసిన వ్యాఖ్యలపై కూడా దేవెగౌడ స్పందించారు. తాను కుటుంబ పాలనను ప్రోత్సహిస్తున్నానంటూ సిద్ధరామయ్య ఆరోపణలు చేశారని... మరి సిద్ధరామయ్య కొడుకు కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు కదా? అని నిలదీశారు. దానికి సిద్ధరామయ్య ఏ సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు.