mumbai: తల్లి చేతిలోంచి జారిపోయిన పిల్లాడిని.. ముందుకు దూకి రక్షించిన ఎయిర్ హోస్టెస్

  • ముంబయి ఎయిర్ పోర్టులో ఘటన
  • జెట్ ఎయిర్‌వేస్‌కి చెందిన ఎయిర్ హోస్టెస్ సాహసం
  • లేఖ రాసి వివరించిన బాలుడి తల్లి
  • సర్వత్రా ప్రశంసలు

ముంబయి ఎయిర్ పోర్టులో జెట్ ఎయిర్‌వేస్‌కి చెందిన ఎయిర్ హోస్టెస్ మితాన్షి వైద్య ఓ పసివాడి ప్రాణాల్ని కాపాడింది. సాహసోపేతంగా ఆమె ఆ పిల్లాడిని కాపాడిన తీరుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ముంబయి ఎయిర్‌పోర్టులో సాధారణ తనిఖీలు పూర్తి చేసుకుని సెక్యూరిటీ చెక్ కౌంటర్ వద్దకు ఓ మహిళ వస్తోంది. అదే సమయంలో అనుకోకుండా ఆమె చేతుల్లో నుంచి పసివాడు ఒక్కసారిగా జారిపడిపోయాడు. ఈ విషయాన్ని గుర్తించిన ఎయిర్ హోస్టెస్ మితాన్షి వైద్య ముందుకు దూకి ఆ పిల్లాడిని కింద పడకుండా ఒడిసి పట్టుకుంది.

తాజాగా ఆ పసివాడి తల్లి, ఓ ప్రైవేటు కంపెనీకి ఎండీ అయిన గులాఫా ఆ ఎయిర్ హోస్టెస్‌కు కృతజ్ఞతలు చెబుతూ జెట్‌ ఎయిర్‌వేస్‌కు లేఖ రాసింది. ఆ ఎయిర్‌హోస్టెస్‌ తన జీవితం గురించి ఆలోచించకుండా పసివాడిని పట్టుకునేందుకు వెంటనే దూకేసిందని, ఈ క్రమంలో ఆమె ముఖం చీరుకుపోయిందని, ఆమె ముక్కుపై కూడా తీవ్ర గాయమైందని ఆ తల్లి తెలిపింది.

తాను ఆమె మొబైల్ నెంబర్ అడిగినప్పటికీ ఆమె ఇవ్వలేదని, అలా ఇవ్వడం ఎయిర్ లైన్స్ నిబంధనలకు విరుద్ధమని చెప్పిందని, ఆమె దేవత లాంటిదని గులాఫా లేఖలో పేర్కొంది. తనకు పెళ్లి జరిగిన 14 ఏళ్ల తరువాత బాబు పుట్టాడని, తాను ఆ ఎయిర్‌హోస్టెస్‌కు ఏదో ఒకటి ఇచ్చేందుకు ప్రయత్నించినా ఆమె అంగీకరించలేదని తెలిపింది. ప్రార్థన చేసేటప్పుడు తనను గుర్తుచేసుకోండి అంటూ చెప్పి ఆ యువతి వెళ్లిపోయిందని తెలిపింది.

ఆ లేఖను చూసిన జెట్ ఎయిర్‌వేస్ అధికారులు ఎయిర్‌హోస్టెస్‌ వైద్యను మెచ్చుకున్నారు. ఆమె జూడో క్లాసులకు వెళుతుందనీ, ఆ తరగతులు ఇక్కడ కూడా ఉపయోగపడ్డాయని, అందుకే అలాంటి సాహసం చేయగలిగి ఉంటుందని ఓ సీనియర్ ఉద్యోగి తెలిపారు.     

More Telugu News