Hyderabad: నైజీరియన్ల కొత్త మోసం... హైదరాబాద్ వైద్యుడి ఖాతాలో లక్షలేసి, కోట్ల దోపిడీ!

  • పూర్తిగా నమ్మించేందుకు డబ్బులేసిన మోసగాళ్లు
  • క్యాన్సర్ ఔషధం పేరిట దోపిడీ
  • కేసు నమోదుచేసి విచారిస్తున్న పోలీసులు

తమను పూర్తిగా నమ్మేదాకా డబ్బులు వెయ్యరేమోనని భావించారో ఏమో!... నైజీరియన్లు కొత్త తరహా మోసాలకు తెరలేపారు. తమ వద్ద క్యాన్సర్ నివారణ ముందు ఉందని హైదరాబాద్ కు చెందిన ఓ వైద్యుడిని నమ్మించి నిలువునా ముంచారు. తొలుత ఆయన ఖాతాలో డబ్బులు వేసి నమ్మించి, మోసం చేశారు. పోలీసులు వెల్లడించిన మరింత సమాచారం మేరకు, ముషీరాబాద్ లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో సురేష్ కుమార్ అనే డాక్టర్ పనిచేస్తున్నారు.  

ఇటీవల క్యాన్సర్, మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న అనిల్ అనే రోగికి చికిత్స చేస్తున్న వేళ, సిమ్లాలో గీత అనే మహిళ ఆధ్వర్యంలో 'ఒబికాజిన్ బీ2' అనే ఔషధం తయారవుతోందని, దీనికి విదేశాల్లో మంచి గిరాకీ ఉందని అతని ద్వారా తెలిసింది. ఆపై సదరు డాక్టర్ గీతను సంప్రదించగా, ఆ ఔషధాన్ని లీటరు రూ. 5 లక్షలకు విక్రయిస్తున్నామని, అమ్మితే రూ. 7 లక్షలు వస్తుందని చెప్పింది.

ఆమెతో మాట్లాడిన రెండో రోజే, తాను కాలిఫోర్నియా నుంచి మాట్లాడుతున్నట్టు పరిచయం చేసుకున్న ఓ వ్యక్తి, తనకు ఓ లీటరు క్యాన్సర్ ఔషధం కావాలని కోరాడు. దీంతో సురేష్ కుమార్ రూ. 5 లక్షలను గీత ఖాతాలో వేయగా, ఆమె నుంచి ఔషధం వచ్చింది. దాన్ని తీసుకుని ముంబై ఎయిర్ పోర్టు వద్దకు వెళ్లగా, మైఖేల్ అనే యువకుడు కలిసి దాన్ని తీసుకున్నాడు. ఆ తరువాతి రోజు అతనే ఫోన్ చేసి, ఔషధం నాణ్యతా ప్రమాణాలను పొగిడాడు. అతని ఖాతాలో రూ. 5.30 లక్షలు వేశాడు. మిగతా డబ్బు తరువాత ఇస్తానని చెప్పాడు. దీంతో వైద్యుని ఆనందానికి అంతులేకుండా పోయింది.

ఆపై వారం రోజుల తరువాత తమకు 50 లీటర్ల 'ఒబిజికాన్ బీ2' కావాలంటూ మైఖేల్ సంప్రదించాడు. రెండు వారాల వ్యవధిలో తెచ్చివ్వాలని సూచించాడు. తన వద్ద డబ్బు లేకపోగా, స్నేహితులు, బంధువుల వద్ద అప్పు చేసి మరీ రూ. 2.5 కోట్లను కూడగట్టుకున్న సురేష్ కుమార్, గీత తెలిపిన ఖాతాల్లో ఆ మొత్తాన్ని జమ చేశాడు. ఆపై మందు రాలేదు సరికదా, ఫోన్ కూడా పనిచేయకపోవడంతో మోసపోయినట్టు గ్రహించి లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. కాగా, సదరు గీత గురించి సురేష్ కుమార్ కు చెప్పిన రోగి క్యాన్సర్ తో మరణించడం గమనార్హం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.

More Telugu News