Hyderabad: వ్యసనాలకు అలవాటై దొంగగా మారిన టీవీ నటుడికి అరదండాలు

  • చోరీల్లో దిట్టగా మారిన నాగరాజు
  • చైతన్యపురి, సరూర్ నగర్ పరిధిలో 16  దొంగతనాలు
  • నిందితుడి నుంచి రూ.14.52 లక్షల విలువైన నగలు స్వాధీనం

వ్యసనాలకు అలవాటై దొంగగా మారిన ఓ టీవీ నటుడికి హైదరాబాద్ పోలీసులు అరదండాలు వేశారు. దొంగతనాలు చేయడంలో దిట్టగా మారిన అతడు వివిధ ప్రాంతాల్లో లెక్కలేనన్ని దొంగతనాలకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లోని లక్కారం రోడ్డు ప్రాంతానికి చెందిన బారి నాగరాజు (23) అలియాస్ నరేందర్ అలియాస్ గుంటూరు నరేంద్ర డిగ్రీ చదువుకి మధ్యలోనే స్వస్తి చెప్పి సెంట్రింగ్ కార్మికుడిగా మారాడు. అనంతరం పెళ్లి చేసుకుని 2016లో హైదరాబాద్‌కు మకాం మార్చాడు.

సినీ రంగంపై ఉన్న మోజుతో ప్రముఖ స్టూడియోలో కొంతకాలం ప్రొడక్షన్ విభాగంలో పనిచేశాడు. ఈ క్రమంలో ఓ హాస్య నాటికలో నటించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత వ్యసనాలకు అలవాటు పడి డబ్బులు చాలక ఇబ్బంది పడ్డాడు. దీంతో దొంగగా మారాడు. దొంగిలించిన నగలను గోల్డ్‌లోన్ సంస్థల్లో తాకట్టు పెట్టి రుణం తీసుకునేవాడు.

హుజూర్ నగర్‌లో నాలుగు బైకులు చోరీ చేశాడు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని చైతన్యపురి, సరూర్‌ నగర్  పోలీస్ స్టేషన్ల పరిధిలో 16 చోరీలు చేశాడు. ఈ క్రమంలో చైతన్యపురి పోలీసులకు చిక్కాడు. అతడి నుంచి రూ.14,52,500 విలువైన 72 తులాల బంగారు ఆభరణాలు, 310 గ్రాముల వెండి నగలను స్వాధీనం చేసుకున్నారు. నాగరాజుపై పీడీ చట్టాన్ని ప్రయోగించినట్టు రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ ఎం.భగవత్ తెలిపారు.

More Telugu News