Chris Gale: అలా రాసిపెట్టి ఉంది... జరిగిందంతే: క్రిస్ గేల్

  • ఈ ఐపీఎల్ సీజన్ లో రాణిస్తున్న క్రిస్ గేల్
  • నాలుగు మ్యాచ్ లలో 252 పరుగులు
  • వద్దని పక్కన బెట్టేసిన ఆర్సీబీ
  • కనీస ధరకే కొన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్

క్రిస్ గేల్... ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో ఆడింది నాలుగు మ్యాచ్ లే అయినప్పటికీ, 252 పరుగులు చేసి, పొట్టి క్రికెట్ లో తానెంత ముఖ్యమో చెప్పకనే చెబుతున్నాడు. తనను వదిలేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో పాటు, తనను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపని మిగతా ఫ్రాంచైజీలకు తన విధ్వంసక బ్యాటింగ్ తో సమాధానం చెబుతున్నాడు. కనీస ధరకు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టుకు అమ్ముడైన క్రిస్ గేల్, ఈ సీజన్ లో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో తాను పంజాబ్ జట్టుకు ఆడాలని రాసిపెట్టి ఉన్నదని, అందువల్లే బెంగళూరు ఫ్రాంచైజీ తనను వదిలేసుకుందని ఓ ఇంటర్వ్యూలో క్రిస్ గేల్ వ్యాఖ్యానించాడు.

తనను వేలంలో ఎవరూ కొనుగోలు చేయడం లేదని తెలిసిన తరువాత తానేమీ బాధపడలేదని, జీవితమంటే క్రికెట్ మాత్రమే కాదన్నది తన అభిప్రాయమని చెప్పాడు. నమ్మకంతో తనను కొనుగోలు చేసిన జట్టుకు సేవలందించడమే ప్రస్తుతం తన ముందున్న కర్తవ్యమని చెప్పాడు. తాను ఏ జట్టుకు ఆడుతున్నా, ఆ జట్టు గెలవాలనే కోరుకుంటానని చెప్పుకొచ్చాడు. మిగతా ఫ్రాంచైజీలు వేలంలో పాల్గొనకపోవడంపై స్పందిస్తూ, తానేమీ తప్పుగా ప్రవర్తించలేదని అన్నాడు. ప్రతి మ్యాచ్ లోనూ రాణించడం ఎవరి వల్లా కాదని, ఎత్తుపల్లాలు సహజమేనని చెప్పాడు.

More Telugu News