Petrol: రాష్ట్రాల ముందు 'ముందు నుయ్యి, వెనుక గొయ్యి'... పెట్రోల్, డీజిల్ పోతే మిగిలేది 'వైన్స్' మాత్రమే!

  • రోజురోజుకూ పెరుగుతున్న 'పెట్రో' ధరలు
  • పెట్రోలు, డీజిల్ పై కేంద్ర, రాష్ట ప్రభుత్వాల పన్ను బాదుడు
  • జీఎస్టీ పరిధిలోకి తెచ్చి ఉపశమనం ఇవ్వాలంటున్న ప్రజలు
  • అదే జరిగితే ఆదాయం పోతుందని ప్రభుత్వాల భయం

అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న క్రూడాయిల్ ధరల పుణ్యమాని దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పటికే నాలుగేళ్ల గరిష్ఠానికి చేరుకున్నాయి. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలతో పాటు చెందని దేశాలతో పోల్చి చూసినా ఇండియాలోనే 'పెట్రో' ఉత్పత్తుల ధరలు అధికంగా ఉన్నాయనడంలో సందేహం లేదు. వివిధ రకాల కేంద్ర పన్నులకు తోడు, రాష్ట్రాల పన్నులు కూడా ఉండటమే ఇందుకు కారణమన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక పెట్రోలు ధరల విషయమై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతూ పన్నులను తగ్గించాలని ఒత్తిడి వస్తున్న వేళ, మీరు తగ్గించాలంటే, మీరు తగ్గించాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరికి ఒకరు సలహాలు ఇచ్చుకుంటున్న పరిస్థితి నెలకొంది.

ఇదే సమయంలో 'పెట్రో' ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకెళ్లాలన్న డిమాండ్ కూడా ఊపందుకుంటోంది. జీఎస్టీలో 'పెట్రో' ఉత్పత్తులను చేర్చాలన్న విషయమై రాష్ట్ర ప్రభుత్వాలు ఏమీ చెప్పలేని స్థితిలో ఉన్నాయి. కారణం 'ముందు నుయ్యి, వెనుక గొయ్యి' అన్న పరిస్థితి ఏర్పడటమే. రాష్ట్రాలకు ప్రధాన ఆదాయ వనరులు పెట్రోలు, డీజిల్, మద్యం ఉత్పత్తులేనన్నది ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. పెట్రోలు, డీజిల్ అమ్మకాలను జీఎస్టీ పరిధిలోకి తెస్తే, వాటి అమ్మకాలపై ఆదాయంలో సగం కేంద్రానికి వెళుతుంది.

ఉదాహరణకు ఏపీలో సంవత్సరానికి రూ. 8,500 కోట్ల ఆదాయం 'పెట్రో' అమ్మకాల ద్వారా వస్తుండగా, జీఎస్టీ పరిధిలోకి వీటిని తెస్తే రూ. 4 వేల కోట్ల ఆదాయం తగ్గుతుంది. ఒకవేళ రూ. 4గా ఉన్న వ్యాట్ ను రూ. 2 కు తగ్గించినా, రూ. 1000 కోట్లకు పైగా నష్టాన్ని భరించాల్సి వుంటుంది. ఈ నేపథ్యంలో ధరలను తగ్గించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని రాష్ట్రాల ప్రభుత్వాలు అంటున్నాయి. ఒకవేళ ఈ ఉత్పత్తులను జీఎస్టీలో చేర్చితే, రాష్ట్రాల చేతుల్లో ప్రధాన ఆదాయ వనరుగా మిగిలేది మద్యం అమ్మకాలు మాత్రమే. ఈ నేపథ్యంలో రోజురోజుకూ పెరుగుతున్న ప్రజాగ్రహాన్ని ఎలా తట్టుకోవాలో తెలియక అధికారులు తలపట్టుకుంటున్నారు.

More Telugu News