Bengaluru: ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో బెంగళూరు వాసికి మరణశిక్ష!

  • గతేడాది బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు పిల్లల తండ్రి
  • అత్యాచారం అనంతరం హత్య చేసి పరారీ
  •  మరణశిక్షను హైకోర్టు ధ్రువీకరించాల్సివుంది  

ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి, ఆపై హత్య చేసిన ఓ వ్యక్తికి బెంగళూరులోని సిటీ కోర్టు మరణశిక్ష విధించింది. కోర్టు తీర్పుపై అతడు హైకోర్టుకు అప్పీలుకు వెళ్లే అవకాశం ఉంది. ఇద్దరు పిల్లల తండ్రి అయిన అనిల్ బాలాగర్ (35) ఇంటి ఎదురుగా.. తన తాతగారింటి బయట ఓ బాలిక ఆడుకుంటుండగా 20 ఏప్రిల్ 2017న సాయంత్రం 6:15 గంటల ప్రాంతంలో అదృశ్యమైంది. అదే రోజు సాయంత్రం 8 గంటలకు తాను తన సొంతూరికి వెళ్తున్నానని బాలాగర్ అక్కడి వారికి చెప్పి వెళ్లిపోయాడు. ఆ వెంటనే అతడి మొబైల్ స్విచ్చాఫ్ వచ్చింది.

బాలిక కోసం గాలించినా ఆచూకీ దొరకకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు రోజుల తర్వాత బాలాగర్ ఇంటి నుంచి దుర్వాసన వస్తుండడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు ఫోన్ చేశారు. తలుపులు బద్దలుకొట్టి చూడగా బాలిక మృతదేహం కనిపించింది. బాలికపై అత్యాచారం చేసిన అనంతరం బాలికను చంపివేసినట్టు పోలీసు దర్యాప్తులో వెల్లడైంది.

కేసును విచారించిన న్యాయస్థానం బాలాగర్‌ను దోషిగా తేల్చింది. బాలికను హత్య చేసినందుకు మరణశిక్ష, అత్యాచారానికి పాల్పడినందుకు పదేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు, రూ.10 వేల జరిమానా విధించింది. మరణశిక్షను హైకోర్టు ధ్రువీకరించవలసి ఉంది.   

More Telugu News