Talasani: భవిష్యత్తులో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, వారు ఉండేది కూడా ప్రగతి భవన్‌ లోనే!: తలసాని

  • ప్రగతి భవన్‌ గురించి కాంగ్రెస్‌ నేతలు విమర్శలు చేస్తున్నారు
  • కేసీఆర్‌ కుటుంబం గురించి మాట్లాడుతున్నారు
  • వారసత్వ రాజకీయాల గురించి కాంగ్రెస్‌ నేతలా చెప్పేది?
  • చేసిన అవినీతి ఆరోపణల్లో ఒక్కటైనా నిరూపించారా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీపీసీసీ నేతలు చేస్తోన్న విమర్శలపై మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మండిపడ్డారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రగతి భవన్‌ గురించి కాంగ్రెస్‌ నేతలు చేస్తోన్న వ్యాఖ్యలు అభ్యంతరకమని, భవిష్యత్తులో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వారు ఉండేది కూడా అందులోనేనని అన్నారు. కేసీఆర్‌ కుటుంబంపై టీపీసీసీ నేతలు ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అప్పట్లో వైఎస్‌ఆర్‌ బేగంపేటలో క్యాంప్‌ ఆఫీస్‌ పెడితే కాంగ్రెస్‌ నేతలు ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు. కుటుంబ రాజకీయాలంటూ కేసీఆర్‌ కుటుంబంపై పదే పదే విమర్శలు చేస్తున్నారని అన్నారు.

నెహ్రూ నుంచి రాహుల్ గాంధీ వరకు ఉన్న కాంగ్రెస్ చరిత్రను ఒకసారి చూసుకోండని, వారసత్వ రాజకీయాల గురించి కాంగ్రెస్‌ నేతలా చెప్పేది? అని తలసాని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ ఓ అవినీతి పార్టీ అని, కేసీఆర్‌పై టీపీసీసీ నేతలు చేసిన అవినీతి ఆరోపణల్లో ఒక్కటైనా నిరూపించారా? అని ప్రశ్నించారు. కేటీఆర్‌, కవిత ప్రజల్లోకి వెళ్లి నిరూపించుకుని ప్రతినిధులుగా గెలిచారని అన్నారు. 'సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారట... ఎందుకిచ్చారు? ఇచ్చే పరిస్థితి వచ్చినందుకు ఇచ్చారు. తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాజీనామాలు చేయలేదు' అని తలసాని వ్యాఖ్యానించారు. అటువంటి కాంగ్రెస్ నేతలు తమపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

More Telugu News