Delhi Daredevils: కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే రికార్డు సృష్టించిన శ్రేయాస్ అయ్యర్.. ఢిల్లీకి అపూర్వ విజయం!

  • కెప్టెన్‌గా మారాక రెచ్చిపోయిన శ్రేయాస్ 
  • పరాజయాలతో కుంగిపోతున్న జట్టులో కొత్త ఉత్సాహం
  • కోల్‌కతాపై భారీ విజయం

ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ దశ తిరిగింది. కొత్త కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ జట్టుకు విజయం రుచి చూపించాడు. ఐపీఎల్‌లో భాగంగా శుక్రవారం ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఘన విజయం సాధించింది. కెప్టెన్ పగ్గాలు అందుకున్న శ్రేయాస్ అయ్యర్ చెలరేగిపోయి ఆడాడు. సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. 40 బంతుల్లో మూడు ఫోర్లు, 10 సిక్సర్లతో అజేయంగా 93 పరుగులు చేశాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 219 పరుగులు చేసింది. ఓపెనర్లు పృథ్వీషా (62), కోలిన్ మన్రో (33) శుభారంభాన్ని ఇచ్చారు. మన్రో అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్ చిచ్చరపిడుగల్లే చెలరేగిపోయాడు. బంతులను ఎడాపెడా బాదుతూ స్కోరు బోర్డును ఉరకలెత్తించాడు. రిషబ్ పంత్ గోల్డెన్ డక్‌గా అవుటైనా తర్వాత బరిలోకి దిగిన మ్యాక్స్‌వెల్ మెరుపులు మెరిపించాడు. 18 బంతుల్లో ఫోర్, రెండు సిక్సర్లతో 27 పరుగులు చేయడంతో ఢిల్లీ 20 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 219 పరుగుల భారీ స్కోరు సాధించింది.

అనంతరం 220 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా పరుగుల వేటలో చతికిల పడింది. వికెట్లు టపటపా రాల్చుకుంది. ఆదుకుంటారనుకున్న రాబిన్ ఉతప్ప, నితీశ్ రాణా, శివమ్ మావి, పీయూష్ చావ్లా‌లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. పది ఓవర్లు ముగిసే సరికి ఐదు కీలక వికెట్లను కోల్పోయిన కార్తీక్ సేన.. తర్వాత ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. ఆండ్రూ రసెల్ ( 44) పోరాడినా అతడికి అండగా నిలిచేవారు కరువయ్యారు. ఫలితంగా 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 164 పరుగుల వద్ద కోల్‌కతా ఇన్నింగ్స్ ముగిసింది.

  93 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ మ్యాచ్‌ ద్వారా అయ్యర్ మరో అరుదైన ఘనత కూడా సాధించాడు. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ ఐదింటిలో ఓడి రెండు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో కింది నుంచి రెండో స్థానంలో ఉంది.

More Telugu News