Cash Crunch: అలవాట్లను మార్చుకోని భారతీయులు... ఇండియాలో డబ్బంతా ఎక్కడ ఉందో చెబుతున్న ఆర్బీఐ!

  • రెండు నెలలుగా నగదు సంక్షోభం
  • కారణాలను తన నివేదికలో వెల్లడించిన ఆర్బీఐ
  • అత్యధిక డబ్బు ఇళ్లల్లోనే ఉందన్న అభిప్రాయం

2016 నవంబరులో పెద్ద నోట్ల రద్దు తరువాత ఇండియాలో నగదు కష్టాలు ఎంతగా పెరిగిపోయాయో అందరికీ తెలిసిందే. ఆపై ఆరు నెలల తరువాత కొంత మేరకు కష్టాలు సర్దుకున్నప్పటికీ, గత రెండు నెలలుగా నగదు కొరత పెరిగి పెను సంక్షోభమైంది. ఇక ఇండియాలో నగదు కొరతకు గల కారణాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన నివేదికలో ప్రస్తావించింది.

ఏప్రిల్ 20తో ముగిసిన వారంలో తాము చలామణిలోకి పంపిన నగదంతా విత్ డ్రా అయిందని చెప్పింది. మొత్తం 16.34 వేల కోట్లు విత్ డ్రా అయ్యాయని, మొత్తం మూడు వారాల వ్యవధిలో 59.52 వేల కోట్లు విత్ డ్రా అయ్యాయని తెలిపింది. వాస్తవానికి ప్రజలు విత్ డ్రా చేసుకున్న డబ్బులు వారం పదిరోజుల్లో తిరిగి సర్క్యులేషన్ లోకి వస్తాయని, కానీ కొత్త నోట్లు తిరిగి బ్యాంకులకు రావడం లేదని తెలిపింది. ఇంట్లో సాధ్యమైనంత ఎక్కువ డబ్బు దాచుకోవాలని భావిస్తున్న వారి కారణంగానే ఇది జరుగుతోందని తెలిపింది.

ఇక మొత్తం జనవరి - మార్చి త్రైమాసికంలో 1.40 లక్షల కోట్ల డబ్బు విత్ డ్రా అయింది. 2016 తొలి మూడు నెలలతో పోలిస్తే ఇది 27 శాతం అధికం. మొత్తం మీద చలామణిలో 1.89 లక్షల కోట్లు ఉందని, ఇందులో అత్యధిక మొత్తం ఇళ్లలో ఉందని అంచనా వేసింది. కాగా, ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటక, మధ్య ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో నగదు కొరత తీవ్రంకాగా, నిరంతరాయంగా కొత్త నగదు ముద్రించి పంపామని ఆర్బీఐ వెల్లడించింది.

More Telugu News