Maoists: మావోయిస్టులపై చావు దెబ్బ కొట్టేందుకు కారణమైన చిన్న క్లూ!

  • మూడు రాష్ట్రాల ఆపరేషన్ తో మావోలపై కోలుకోలేని దెబ్బ
  • 60 మందికి అల్పాహారం కావాలని ఆర్డర్
  • అదే క్లూగా దూసుకెళ్లిన కూంబింగ్ దళాలు
  • ఎన్ కౌంటర్ లో 39 మంది మావోల మృతి

మహారాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ, చత్తీస్ గఢ్ ప్రభుత్వాల సహకారంతో చేపట్టిన అతిపెద్ద మావోయిస్టు ఆపరేషన్ విజయవంతం వెనుక పోలీసు ఉన్నతాధికారులకు లభించిన ఓ చిన్న క్లూయే కారణమని తెలుస్తోంది. ఈ ఎన్ కౌంటర్ లో ఇప్పటివరకూ 39 మంది చనిపోయారు. ఆ ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలకు ఇది పెద్ద దెబ్బే. గడ్చిరోలి పోలీస్ స్టేషన్ పరిధిలోని సీ-60 కమాండోలు ఈ ఆపరేషన్ కు ప్లాన్ చేశారు. మహారాష్ట్ర, తెలంగాణ, చత్తీస్ గఢ్ రాష్ట్రాలు సరిహద్దులను పంచుకునే అటవీ ప్రాంతంలో పేరిమిల్లి, ఆహేరి, సిరోంచా దళాలు కలుస్తున్నాయన్న సమాచారం పోలీసు ఉన్నతాధికారులకు అందింది. అయితే, వారు ఎక్కడ కలుస్తారన్న సమాచారం మాత్రం లభించలేదు. అప్పటికే మూడు రాష్ట్రాల పోలీసులూ అప్రమత్తమై, పెట్రోలింగ్ పార్టీలను రంగంలోకి దించాయి. ఆ సమయంలోనే వారికి ఓ చిన్న క్లూ లభించింది.

50 నుంచి 60 మందికి సరిపడా అల్పాహారాన్ని తయారు చేసి అందించాలంటూ ఓ హోటల్ కు వచ్చిన ఆర్డర్ వివరాలు కూంబింగ్ దళాలకు చేరాయి. ఆ ఆర్డర్ ఎక్కడికి వెళుతుందో స్పష్టంగా విచారించిన పోలీసులు, ఆ ప్రాంతంపై మెరుపుదాడి చేశారు. ఆ ప్రాంతం చుట్టూ ఇంద్రావతి నది ప్రవహిస్తుండటంతో అక్కడే మావోల సమావేశం జరగనుందని నిర్ధారించి, ఆ ప్రాంతానికి దూసుకెళ్లారు.

కసన్సూర్ అడవుల్లో ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఎన్ కౌంటర్ మధ్యాహ్నం 1.30 గంటల వరకూ సాగింది. తొలుత 16 మంది మావోయిస్టుల మృతదేహాలు బయటపడగా, ఆపై ఇంద్రావతి నదిలో 15 మృతదేహాలు మంగళవారం, మిగతావి బుధవారం బయటకు వచ్చాయి. గ్రనేడ్ లాంచర్లు, సింగల్ షాట్ లాంచర్లతో పాటు బహిరంగ ప్రదేశాల్లో లక్ష్యాలను సులువుగా చేరే ఆయుధాలను పోలీసులు ఉపయోగించారు. తొలుత మావోలు ఫైరింగ్ మొదలు పెట్టారని, ఆత్మ రక్షణ కోసమే తాము కాల్పులు జరిపామని అధికారులు వెల్లడించారు.

More Telugu News