Andhra Pradesh: పరిశ్రమలు, సంస్థలకు కేటాయించిన భూములు సకాలంలో వినియోగించాలి!: ఏపీ సీఎస్ ఆదేశాలు

  • రాష్ట్రంలోని పారిశ్రామిక వేత్తలందరికీ తప్పక భూములందాలి
  • ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటు చేయాలి
  • పరిశ్రమలకు కేటాయించిన భూములు ఆక్రమణకు గురికాకుండా చర్యలు చేపట్టండి

రాష్ట్రంలో ఏపీఐఐసి ద్వారా వివిధ పరిశ్రమలు, సంస్థలకు కేటాయించిన భూములను సకాలంలో వినియోగానికి తీసుకువచ్చేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఏపీఐఐసీ అధికారులను ఆదేశించారు. ఏపీఐఐసీ ప్రాజెక్టులు -భూములు కేటాయింపు అంశంపై వెలగపూడి సచివాలయంలోని ఆయన కార్యాలయంలో అధికారులతో ఈరోజు సమీక్షించారు. ఈ సందర్భంగా దినేష్ కుమార్ మాట్లాడుతూ, ఇప్పటి వరకూ ఏపీఐఐసీ ద్వారా ప్రభుత్వం వివిధ పరిశ్రమలు, సంస్థలకు కేటాయించిన భూముల్లో పరిశ్రలు ఏర్పాటు చేయడం ద్వారా ఆయా భూములను సకాలంలో వినియోగానికి తెచ్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కేటాయించిన భూములను ఏళ్ల తరబడి వినియోగించకుండా ఉన్న భూములను గుర్తించి వాటి కేటాయింపును రద్దు చేసేందుకు కూడా అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ఆ దిశగా కూడా తగిన చర్యలు తీసుకోవాలని ఏపీఐఐసీని ఆదేశించారు. పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతో ఆయా సంస్థలు అవగాహనా ఒప్పందాలు (ఎంఒయులు) కుదుర్చుకున్న అనంతరం సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) లు సమర్పించిన తర్వాత సకాలంలో ఆయా సంస్థలకు అవసరమైన భూములను కేటాయించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. అదే విధంగా, ఏపీఐఐసీ ద్వారా కేటాయించిన భూములు ఆక్రమణలకు గురై వాటికి మళ్లీ నష్టపరిహారం ఇచ్చే పరిస్థితులు తలెత్తకుండా ఆయా భూముల పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.పరిశ్రమలు, సంస్థలకు భూముల కేటాయింపు అంశానికి సంబంధించి కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న కేసులను సకాలంలో పరిష్కరించేందుకు వీలుగా ఏపీఐఐసీ కార్యాలయంలో ఒక విశ్రాంత జిల్లా న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక  లీగల్ సెల్ ను ఏర్పాటు చేసుకోవాలని దినేష్ కుమార్ ఆదేశించారు. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే రాష్ట్రానికి చెందిన పారిశ్రామిక వేత్తలందరికీ తప్పనిసరిగా భూములు అందే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అడ్మినిస్ట్రేటివ్ చార్జెస్ కు సంబంధించి రాష్ట్రంలోని పరిస్థితులను, ఇతర రాష్ట్రాల్లోని పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో పరిశీలించి.. ఆ విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ఏపీఐఐసీ ఎండీని ఆదేశించారు.

కాగా, ఏపీఐఐసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బాబు ఎ, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఏపీఐఐసీ ద్వారా పరిశ్రమలకు భూములు కేటాయింపు ఇతర అంశాలను గురించి వివరించారు. రాష్ట్రంలో 2014 జూన్ నుండి ఇప్పటి వరకూ పరిశ్రమల ఏర్పాటు నిమిత్తం 1613 యూనిట్లకు 13 వేల199 ఎకరాలను కేటాయించినట్టు చెప్పారు. గత ఏడాది కాలంగా 3 వేల 526 ఎకరాల భూమిని కేటాయించామని తెలిపారు. భూములు కేటాయించేందుకు అవసరమైన దరఖాస్తులన్నిటినీ పూర్తిగా ఆన్లైన్ ద్వారానే స్వీకరించడం జరుగుతోందని వివరించారు.

ఈ విధంగా వచ్చిన దరఖాస్తులన్నిటినీ రాష్ట్ర స్థాయి అలాట్ మెంట్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి 15 రోజులకు ఒకసారి పరిశీలించి భూములు కేటాయించేందుకు వీలుగా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఏపీఐఐసీ వద్ద 22 వేల 975 ఎకరాల భూమి కేటాయింపునకు వీలుగా అందుబాటులో ఉందని వివరించారు. ఏపీఐఐసీ ద్వారా 30 వేల 33 ఎకరాల భూమిని అడ్వాన్సు పొజిషన్ చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో నియోజకవర్గానికొక ఎంఎస్ఎంఇ పార్కు ఏర్పాటుకు వీలుగా 7 వేల 502 ఎకరాల భూమిని ఏపీఐఐసీ ద్వారా సేకరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. 

More Telugu News