Madhya Pradesh: మోడల్ స్కర్ట్ లాగి కిందపడేసి, వేధించిన ఇద్దరి అరెస్ట్!

  • ఇండోర్ లో ఘటన
  • సోషల్ మీడియాలో ఫిర్యాదు
  • స్పందించిన శివరాజ్ సింగ్
  • 24 గంటల్లోనే నిందితుల అరెస్ట్

తన ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ మోడల్ ను నడిరోడ్డుపై వేధించిన పోకిరీలను ఇండోర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం జరిగిన ఈ ఘటనపై స్వయంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి స్పందించడంతో, కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు, సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించి నిందితులను గుర్తించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఇండోర్ లో ఆదివారం నాడు బాధిత యువతి యాక్టివా స్కూటర్ పై వెళుతుండగా, ఓ రెడీమేడ్ స్టోర్ లో పని చేస్తున్న ఇద్దరు యువకులు మంగల్ సిటీ మాల్ పరిసరాల్లో ఆమెను వెంబడించారు.

స్కర్టు వెనకాల ఏముందో చూపించాలని అంటూ లాగి కిందపడేశారు. ఈ ఘటనలో ఆమెకు గాయాలు అయ్యాయి. ఆ సమయంలో చుట్టూ పలువురు ఉన్నా ఎవరూ సహాయానికి రాలేదు. ఇక తాను ఎదుర్కొన్న అవమానాన్ని, శరీరంపై గాయాలను చూపిస్తూ సదరు మోడల్, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడంతో శివరాజ్ సింగ్ స్పందించి, నిందితులను పట్టుకోవాలని ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు 24 గంటల్లోనే కేసును ఛేదించగా, వారికి రూ. 20 వేల రివార్డును అందజేయనున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఇక నిందితులను ఇంత త్వరగా అరెస్ట్ చేసిన పోలీసులకు, స్పందించిన సీఎంకు ఆ మోడల్ కృతజ్ఞతలు తెలిపారు.

More Telugu News