President Of India: సొంతిల్లు లేనివారి కోసం విప్లవాత్మక ఆర్డినెన్స్ తేనున్న ప్రభుత్వం!

  • ఐబీసీ చట్టానికి సవరణలు
  • గృహ కొనుగోలుదారులకు ఫైనాన్షియల్ క్రెడిటర్ హోదా
  • సమయానికి గృహాలు అప్పగించకుంటే చర్యలు తీసుకునే హక్కు

2022 నాటికి ప్రతి ఒక్కరికీ సొంతిల్లు ఉండేలా చూస్తానన్న తన హామీకి మరింతగా దగ్గరయ్యే దిశగా నరేంద్ర మోదీ మరో కీలక అడుగు వేశారు. విప్లవాత్మక ఆర్డినెన్స్ ను కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్నట్టు తెలుస్తోంది. ఐబీసీ (ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాక్ రుప్టసీ కోడ్ - దివాలా చట్టం)ని నూతన గృహ కొనుగోలుదారులకు వర్తింపజేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నిర్ణయం అమలైతే గృహ కొనుగోలుదారులకు ఫైనాన్షియల్ క్రెడిటర్ హోదా లభిస్తుంది. సరైన సమయానికి గృహాలను అప్పగించని రియల్ ఎస్టేట్ సంస్థలపై కఠిన చర్యలు తీసుకునే హక్కు వస్తుంది. తమ నుంచి రుణాలు పొంది తిరిగి చెల్లించని వారిపై బ్యాంకులు తీసుకునే చర్యల్లానే గృహ కొనుగోలుదారులు చర్యలు తీసుకోవచ్చు.

కాగా, ఈ ప్రతిపాదనలను క్యాబినెట్ వెంటనే ఆమోదించి, రాష్ట్రపతి నుంచి ఆర్డినెన్స్ ను జారీ చేయించడం ద్వారా దీన్ని అమల్లోకి తేవాలని కేంద్రం భావిస్తోంది. ఇళ్ల కొనుగోలుదారులను దేశంలో ఓ ముఖ్యమైన విభాగంగా భావిస్తున్న కేంద్రం, రియల్ ఎస్టేట్ సంస్థలు జేపీ ఇన్ ఫ్రాటెక్, ఆమ్రపాలి తదితరాలు కస్టమర్లను మోసం చేసిన కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల పరిశీలన అనంతరం ప్రజలకు మరింత సాధికారత కల్పించాలని ఈ నిర్ణయం తీసుకుంది. కంపెనీల వ్యవహారాల శాఖ నుంచి వచ్చిన ప్రతిపాదనలనూ ఈ చట్ట సవరణలో చేర్చారని తెలుస్తోంది. ఐబీసీ చట్టం సెక్షన్ 29ఏకు మార్పులు చేయడం ద్వారా గృహ నిర్మాణ రంగంలో మరింత పారదర్శకత వస్తుందని, ఎంతోమంది ఇన్వెస్టర్లు ముందుకు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.

More Telugu News