Asaram: ఆశారాం బాపు రేప్ కేసులో నేడు తుది తీర్పు.. నాలుగు రాష్ట్రాలు హై అలెర్ట్!

  • ఐదేళ్ల క్రితం 16 ఏళ్ల బాలికపై ఆశారాం అత్యాచారం
  • నేడు తుది తీర్పు వెల్లడించనున్న జోధ్‌పూర్ కోర్టు
  • బాధిత బాలిక ఇంటి చుట్టూ బలగాల మోహరింపు

16 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆశారాం బాపు కేసులో నేడు జోధ్‌పూర్ కోర్టు తుది తీర్పు వెల్లడించనుంది. ఈ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అప్రమత్తంగా ఉండాలంటూ రాజస్థాన్, గుజరాత్, హరియాణా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలను కేంద్రం హెచ్చరించింది. ఆశారాంకు దేశంలో పెద్ద ఎత్తున మద్దతుదారులు (భక్తులు) ఉన్న నేపథ్యంలో కేంద్రం ఈ హెచ్చరికలు జారీ చేసింది.

ఉత్తరప్రదేశ్‌‌లోని జోధ్‌పూర్ సమీపంలో ఉన్న మనాయి ఆశ్రమంలో 2013లో ఆశారాం బాపు 16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడినట్టు కేసు నమోదైంది. సుదీర్ఘ విచారణ అనంతరం నేడు జోధ్‌పూర్ కోర్టు తీర్పు వెలువరించనుంది. ఆశారాంకు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ఫాలోయింగ్ ఉండడంతో భద్రతను కట్టుదిట్టం చేయాలని కేంద్రం పై నాలుగు రాష్ట్రాలకు సూచించింది. అవసరమైతే అదనపు బలగాలను మోహరించాలని ఆదేశించింది.

మరోవైపు బాధిత బాలిక కుటుంబం ఇంటి వద్ద షహరాన్‌పూర్ జిల్లా యంత్రాంగం భారీగా బలగాలను మోహరించింది. తుదితీర్పు సందర్భంగా ఆశారాం బాపు సహా మరో నలుగురు నిందితులు కోర్టుకు హాజరుకానున్నట్టు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

More Telugu News