Nellore District: నెల్లూరు పోలీసుల లీలలు... హెల్మెట్ లేదని ఆటో డ్రైవర్ కు చలానా... 5 నిమిషాల్లో 6 కేసులు!

  • ట్రాఫిక్ పోలీసులు వేధిస్తున్నారంటూ నిరసన
  • ఎక్కడాలేని జరిమానాలు విధిస్తున్నారని విమర్శలు
  • చలానాలను 700 రెట్లు పెంచారని ఆరోపణ

ఆటో డ్రైవర్ కు హెల్మెట్ లేదని జరిమానా... కేవలం ఐదంటే ఐదు నిమిషాల వ్యవధిలో ఓ ఆటోకు ఆరు చలానాలు... నెల్లూరు ట్రాఫిక్ పోలీసుల లీలలివి. నగరంలో ఆటో కార్మికులను ట్రాఫిక్ పోలీసులు వేధిస్తున్నారంటూ, సీఐటీయూ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, రహదారిపై బైఠాయింపు జరుగగా, పలువురు కార్మిక సంఘాల నాయకులు పోలీసుల తీరును ఎండగట్టారు.

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా జరిమానాలు విధిస్తున్న ఘనత నెల్లూరు పోలీసులదేనని వారు నిప్పులు చెరిగారు. చంద్రబాబు కుమారుడు లోకేష్, నగరంలో ఓలా టాక్సీలను నడిపిస్తున్నారని, అందువల్లే ఆటోలను అడ్డుకుంటున్నారని సీఐటీయూ నగర అధ్యక్షుడు అజయ్‌కుమార్‌ వ్యాఖ్యానించారు. ఆర్టీఓలు సైతం పోలీసులకు సహకరిస్తున్నారని ఆరోపించారు.

ఇప్పటికే అధికారులు తమ నుంచి వసూలు చేస్తున్న చలానాలను 700 రెట్లు పెంచారని, నగరం నుంచి రూ. 170 కోట్లు రాష్ట్ర ఖజానాకు వెళ్లిందని అన్నారు. భారీఎత్తున ఆటో డ్రైవర్లు నిరసనలకు దిగడంతో ట్రాఫిక్ జామ్ అయింది. నిరసన స్థలానికి వచ్చిన పోలీసు ఉన్నతాధికారులు, ఆన్ లైన్ మాధ్యమంగా ఈ-చలాన్లు రావడంతో కొన్ని పొరపాట్లు జరిగాయని, అటువంటి విషయాలను తమ దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో కార్మికులు తమ నిరసన విరమించారు.

More Telugu News