David warner: వార్నర్‌కు షాకిచ్చిన బీసీసీఐ.. మ్యాచ్‌లు చూసేందుకూ అనుమతి నిరాకరణ!

  • బాల్ ట్యాంపరింగ్ వివాదంలో ఏడాది నిషేధానికి గురైన వార్నర్
  • ఐపీఎల్‌ గత సీజన్‌లో హైదరాబాద్‌కు సారథ్యం
  • హైదరాబాద్ వస్తానంటే వద్దని తెగేసి చెప్పిన బీసీసీఐ

దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడి ఏడాదిపాటు నిషేధానికి గురైన ఆస్ట్రేలియా మాజీ వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌కు బీసీసీఐ మరో షాకిచ్చింది. ఇప్పటికే ఐపీఎల్‌‌లో ఆడకుండా నిషేధించిన బీసీసీఐ తాజాగా ఐపీఎల్ మ్యాచ్‌లు చూసేందుకు కూడా అనుమతి ఇచ్చేందుకు నిరాకరించడం వివాదాస్పదమైంది.

ఐపీఎల్ గత సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన వార్నర్ ఈసారి ఐపీఎల్ ఆడే అవకాశాన్ని కోల్పోయాడు. అయితే, సొంత జట్టుపై అభిమానం ఉన్న వార్నర్ హైదరాబాద్ వచ్చి జట్టును కలిసి మద్దతు ఇవ్వాలని, సన్‌రైజర్స్ ఆడే ఏదో ఒక మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడాలని భావించాడు. ఇదే విషయాన్ని ఇటీవల వెల్లడించాడు. అయితే, అతడి నిర్ణయానికి బీసీసీఐ మోకాలడ్డినట్టు వార్నర్ భార్య క్యాండైస్ స్వయంగా తెలిపారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడే మ్యాచ్‌లను చూసేందుకు వార్నర్ హైదరాబాద్ రావాలనుకున్నాడని, కానీ బీసీసీఐ మాత్రం వద్దని చెప్పిందని ఆమె పేర్కొన్నారు. ఇష్టమైన జట్టును కలిసి మద్దుతు ఇస్తానంటే బీసీసీఐ అంగీకరించడం లేదంటూ క్యాండైస్ ఆవేదన వ్యక్తం చేశారు. బీసీసీఐ అనుమతి నిరాకరించడంతో వార్నర్ బాధపడుతున్నాడని తెలిపారు.

బీసీసీఐ నిర్ణయంపై నెటిజన్లు, క్రికెట్ ప్రేమికులు మండిపడుతున్నారు. బాల్ ట్యాంపరింగ్‌లో దొరికిపోయిన వార్నర్‌పై విధించిన నిషేధం క్రికెట్ ఆడకుండా మాత్రమేనని, క్రికెట్ చూసేందుకు కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ జట్టు ఆడే మ్యాచ్‌ను చూడడానికి అసలు బీసీసీఐ అనుమతి ఎందుకని ప్రశ్నిస్తున్నారు.

More Telugu News