Andhra Pradesh: ఈ నెల 29న ఏపీ టెన్త్‌ ఫ‌లితాలు.. మే 4న టెట్‌ నోటిఫికేషన్: మంత్రి గంటా శ్రీనివాసరావు

  • విద్యాశాఖ ఉన్న‌తాధికారుల‌తో మంత్రి గంటా స‌మీక్ష‌
  • జూన్ 10 నుంచి టెట్ ప‌రీక్ష‌లు 
  • డీఎస్సీపై  త్వరలో ప్ర‌క‌ట‌న 
  • జ్ఞాన‌ధార కార్య‌క్ర‌మం వాయిదా

ఈ నెల 29వ‌ తేదీన ఉదయం 11 గంటలకు వైజాగ్ వేదికగా ఏపీ ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష ఫ‌లితాలు విడుద‌ల చేయాలని మంత్రి గంటా శ్రీనివాస‌రావు నిర్ణయం తీసుకున్నారు. అలాగే, వచ్చేనెల 4న టెట్‌ నోటిఫికేష‌న్ విడుద‌ల చేయాల‌ని, జూన్ 10 నుంచి టెట్ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. గ‌తంలో లాగానే ఆన్ లైన్ లో టెట్ ప‌రీక్ష‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఈ లెర్నింగ్, వ‌యోజ‌న విద్య‌, మౌలిక వ‌సతులు, లైబ్ర‌రీలు, ఉపాధ్యాయ శిక్ష‌ణ వంటి అంశాల్లో రోట‌రీ క్ల‌బ్ తో అవ‌గాహ‌న ఒప్పందం కుదుర్చుకోవాల‌ని సూత్రప్రాయంగా స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకున్నారు.

విద్యాశాఖ ఉన్న‌తాధికారుల‌తో మంత్రి గంటా ఈ రోజు స‌మీక్ష‌ నిర్వహించి, ఆగ‌స్టులోగా డీఎస్సీ నిర్వ‌హించాల‌ని, ఆ మేర‌కు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్ర‌మంలో రెండు రోజుల్లోగా ఖాళీలపై స్ప‌ష్టత ఇచ్చే దిశ‌గా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్ప‌ష్టం చేశారు. డీఎస్సీపై ఈ మేర‌కు ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లో విడుద‌ల చేస్తామ‌ని మంత్రి గంటా తెలిపారు. ప్ర‌భుత్వ విద్యా సంస్థ‌ల బ‌లోపేతం చేసే దిశ‌గా పాఠ‌శాల‌ల్లో క‌ల్పించ‌నున్న మౌలిక వ‌సతుల క‌ల్ప‌న‌పైనా చ‌ర్చ జ‌రిగింది. యాన్యుటీ ప్రాతిప‌దిక‌న పాఠ‌శాల‌ల్లో క‌ల్పిస్తున్న మౌలిక వ‌సతుల‌ను ఎలా క‌ల్పించాలి? తొలుత  ప్రాధాన్యం దేనికి ఇవ్వాల‌న్న అంశాల‌పై చ‌ర్చించారు.

కొత్త‌గా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న ప‌లు ప్ర‌భుత్వ జూనియ‌ర్, డిగ్రీ క‌ళాశాల‌ల‌కు సంబంధించి జీవోలు జారీ చేసి.. అందుకు త‌గిన ఏర్పాట్లు చేయాల‌ని గంటా శ్రీనివాసరావు స‌మావేశంలో స్ప‌ష్టం చేశారు. మ‌న ఊరు - మ‌న బ‌డి కార్య‌క్ర‌మాన్ని వేస‌వి తీవ్ర ఉష్ణోగ్ర‌త‌ల రీత్యా వాయిదా వేశామని, ఈ కార్యక్రమాన్ని జూన్ తొలి వారంలో నిర్వ‌హించాల‌ని దిశానిర్దేశం చేశారు.

మోడ‌ల్ స్కూళ్ల‌ల్లో వ‌సతులు, స‌దుపాయాల‌పై విస్తృత చర్చ జ‌రిగింది. మే 1 నుంచి జ‌ర‌గాల్సిన జ్ఞాన‌ధార కార్య‌క్ర‌మాన్ని వాయిదా వేస్తూ స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకున్నారు. రాష్ట్రాన్ని నాలెడ్జ్ స్టేట్ - ఎడ్యుకేష‌న్ హ‌బ్ గా తీర్చిదిద్ద‌డ‌మే ధ్యేయంగా వినూత్న సంస్క‌ర‌ణ‌లు ఆచ‌ర‌ణాత్మ‌క ప‌ద్ధ‌తుల‌తో ముందుకెళ్లాల‌ని మంత్రి గంటా ఉన్న‌తాధికారుల‌కు పిలుపునిచ్చారు.

More Telugu News