Hari Manjhi: మద్య నిషేధం రాష్ట్రంలో మందుతాగి అరెస్టైన బీజేపీ ఎంపీ కుమారుడు!

  • గయలో స్నేహితులతో కలసి మందు తాగిన ఎంపీ కుమారుడు
  • అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • రాష్ట్రంలో మద్యనిషేధమే లేదంటూ ఆర్జేడీ ఎద్దేవా

ఇటీవలి కాలంలో వివిధ కారణాలతో బీజేపీ నేతలు వార్తల్లోకి ఎక్కుతున్న ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా, బీహార్ లోని గయ బీజేపీ ఎంపీ హరి మాంఝీ కుమారుడు రాహుల్ కుమార్ మాంఝీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీహార్ లో నితీష్ కుమార్ ప్రభుత్వం మద్యనిషేధాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, గయ మెడికల్ కాలేజ్ పోలీస్ స్టేషన్ ఏరియాలో రాహుల్ తన స్నేహితులతో కలసి ఆల్కహాల్ సేవించి పోలీసులకు పట్టుబడ్డాడు. నిన్న రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ ఘటనపై ఎంపీ హరి మాంఝీ మాట్లాడుతూ, తన కుమారుడిపై పోలీసులు తప్పుడు లిక్కర్ కేసు పెట్టారని మండిపడ్డారు. చట్ట విరుద్ధంగా జరుగుతున్న లిక్కర్ అమ్మకాలపై తాను డిప్యూటీ ఇన్స్ పెక్టర్ జనరల్ కు సమాచారం ఇచ్చానని... ఈ క్రమంలో తన సమాచారాన్ని ఉపయోగించుకుని అక్రమ మద్యం వ్యాపారులపై పోలీసులు యాక్షన్ తీసుకోకుండా, తన కుమారుడిని ఇరికించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో ఆర్జేడీ కూడా స్పందించింది, మద్యనిషేధం పేరుతో రాష్ట్రంలో పెద్ద నాటకం నడుస్తోందని ఆర్జేడీ ఎమ్మెల్యే వీరేంద్ర ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడా మద్య నిషేధం లేదని, మందుబాబులంతా పబ్లిక్ గా మందు తాగుతున్నారని, ప్రొహిబిషన్ చట్టం గురించి ఎవరూ భయపడటం లేదని ఎద్దేవా చేశారు. 

More Telugu News