Chandrababu: కేంద్రంతో సఖ్యతగా ఉండాలన్న గవర్నర్.. ఆ ఒక్కటీ అడగొద్దన్న చంద్రబాబు

  • 1:40 గంటల పాటు భేటీ అయిన చంద్రబాబు-నరసింహన్
  • కేంద్రంపై దూకుడు తగ్గించాలన్న గవర్నర్
  • సఖ్యతగా ఉంటూ కావాల్సింది సాధించుకోవాలని సూచన
  • ఇంతదాకా వచ్చాక వెనక్కి తగ్గేది లేదన్న చంద్రబాబు

ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంతో ఢీ అంటే ఢీ అని తలపడుతున్న ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఆదివారం గవర్నర్‌ నరసింహన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దూకుడు కాస్త తగ్గించాలని చంద్రబాబుకు గవర్నర్ సూచించగా.. తగ్గేదే లేదని చంద్రబాబు తెగేసి చెప్పినట్టు తెలుస్తోంది.

రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ వేడిని చల్లార్చే ప్రయత్నంలో భాగంగా.. కేంద్రంతో సామరస్య పూర్వకంగా వెళ్లడమే మేలని గవర్నర్ సీఎంకు సూచించారు. విజయవాడలోని గేట్‌ వే హోటల్‌లో ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో వీరిద్దరూ 1:40 గంటల పాటు ఏకాంతంగా భేటీ అయ్యారు. కేంద్రంపై చంద్రబాబు పోరాటం నేపథ్యంలో వీరి కలయిక ప్రాధాన్యం సంతరించుకుంది.  

ఈ సందర్భంగా నరసింహన్ మాట్లాడుతూ.. తాను ఎవరి తరపునా రాలేదని, మీ శ్రేయోభిలాషిగా చెబుతున్నానని, కేంద్రంతో సఖ్యతగా ఉండాలని చంద్రబాబుకు సూచించినట్టు తెలిసింది. ఆందోళన విషయంలో పెంచిన జోరును తగ్గించాలని సూచించారు. అయితే చంద్రబాబు మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడే సమస్యే లేదని గవర్నర్ వద్ద కుండ బద్దలు కొట్టారు.

నాలుగేళ్లు ఎదురుచూసినా అన్యాయమే జరిగిందని, చిట్ట చివరి బడ్జెట్‌లోనూ అన్యాయం జరగడం వల్లే పోరాట పంథా ఎంచుకున్నామని చెప్పారు. తనకు కూడా ఎవరిపైనా శత్రుత్వం లేదని, రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని పేర్కొన్నారు.

చంద్రబాబు వ్యాఖ్యలపై గవర్నర్ నరసింహన్ స్పందిస్తూ ఆందోళనల సమయంలో సంయమనం పాటించాలని సూచించినట్టు తెలిసింది. ఈ సందర్భంగా తిరుపతిలో బైకు తగలబెట్టిన విషయాన్ని గవర్నర్ గుర్తు చేస్తూ, మరీ అంత దూకుడు మంచిది కాదని హితబోధ చేశారు.

తన పుట్టిన రోజున ధర్మ పోరాట దీక్ష ఎందుకు చేయాల్సి వచ్చిందో కూడా గవర్నర్‌కు చంద్రబాబు వివరించారు. పార్టీ నేతల్లో కొందరు కేంద్రంపై మరీ తీవ్రంగా విరుచుకు పడుతున్నారని, పరుష పదజాలం ఉపయోగిస్తున్నారని గవర్నర్ అన్నట్టు తెలిసింది. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని, సరిదిద్దాల్సిన అవసరాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా గవర్నర్ నరసింహన్‌ను చంద్రబాబు కోరినట్టు సమాచారం.

ఏకాంత భేటీలో గవర్నర్-చంద్రబాబు ఏం మాట్లాడుకున్నారన్న వివరాలను వెల్లడించలేదు. అయితే, గవర్నరు నరసింహన్‌ మాత్రం ఈ భేటీకి ఎటువంటి ప్రాధాన్యం లేదని, ఇది ఇద్దరి పాత మిత్రుల సమావేశం మాత్రమేనని పేర్కొనడం గమనార్హం.

More Telugu News