హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీలో ‘సన్‌రైజర్స్’.. చూసేందుకు పోటెత్తిన అభిమానులు

22-04-2018 Sun 07:30
  • వస్త్ర దుకాణాన్ని ప్రారంభించిన సన్‌రైజర్స్ ఆటగాళ్లు 
  • సంప్రదాయ వస్త్రాలు ధరించి హల్‌చల్
  • అభిమానులను నియంత్రించేందుకు పోలీసుల అవస్థలు

ఐపీఎల్‌లో ఆడుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీలో కనిపించడంతో అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఆ వెంటనే వారిని చూసేందుకు పోటెత్తారు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం అభిమానులతో కిటకిటలాడిపోయింది. ప్రాక్టీసు మానేసి వీరు ఇక్కడికి రావడానికి ఓ కారణముంది.

కేపీహెచ్‌బీ సర్వీసు రోడ్డులో కొత్తగా ఓ వస్త్ర దుకాణాన్ని ఏర్పాటు చేశారు. దీని ప్రారంభోత్సవానికి యాజమాన్యం జట్టును ఆహ్వానించింది. దీంతో కెప్టెన్ విలియమ్సన్, వీవీఎస్ లక్ష్మణ్, ముత్తయ్య మురళీధరన్, స్వాన్‌లేక్, వృద్ధిమాన్ సాహా, బిపుల్ శర్మ తదితరులు హాజరయ్యారు. ప్రారంభోత్సవం అనంతరం వారు షాపంతా కలయదిరిగారు. షోరూంలోని సంప్రదాయ వస్త్రాలు ధరించి సందడి చేశారు. అభిమాన క్రికెటర్లు వచ్చారని తెలుసుకున్న అభిమానులు వారిని చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారిని నియంత్రించేందుకు పోలీసులు నానా అవస్థలు పడాల్సి వచ్చింది.