Pawan Kalyan: పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలకు మా క్లయింట్ ఆశ్చర్యపోయాడు: లీగల్ నోటీసులో శ్రీనిరాజు తరపు న్యాయవాది

  • మీరు ఏ నిందారోపణలైతే చేశారో, అవి పూర్తిగా నిరాధారం
  • ఇతర రాజకీయ నాయకులలా మీరు కూడా వ్యవహరిస్తే ఎలా?
  • శ్రీనిరాజు పేరిట చేసిన ట్వీట్స్ ను తొలగించండి
  • లేకపోతే, లీగల్ చర్యలు తప్పవు

సంబంధం లేని విషయాల్లోకి తనను లాగి, తన తల్లిని అసభ్యంగా తిట్టించడం వెనుక టీవీ 9 చానెల్ యజమాని శ్రీనిరాజు, సీఈఓ రవిప్రకాష్ ఉన్నారంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ కు శ్రీనిరాజు  లీగల్ నోటీసులు పంపారు. చేసిందంతా చేసి ఇప్పుడు తనకు లీగల్ నోటీసులు పంపించడమేంటంటూ శ్రీనిరాజుని పవన్ మరోపక్క ప్రశ్నించారు. శ్రీనిరాజు తనకు పంపిన లీగల్ నోటీసుల ప్రతిని పవన్ తన పోస్ట్ లో పొందుపరిచారు. శ్రీనిరాజు తరపు అడ్వొకేట్ సునీల్ రెడ్డి పంపిన నోటీసుల్లో ఏమన్నారంటే..

‘నా క్లయింట్ మిస్టర్ శ్రీనిరాజు సూచనల మేరకు ఈ నోటీసును మీకు పంపుతున్నాను. మొదటగా, మీ అధికారిక ట్విట్టర్ ఖాతా (https://twitter.com/pawankalyan) ద్వారా పొందుపరిచిన పోస్టింగ్స్ గురించి తన స్నేహితులు, శ్రేయోభిలాషుల ద్వారా తెలుసుకున్న నా క్లయింట్ ఆశ్చర్యపోయాడు. మీరు ఏ నిందారోపణలైతే చేశారో, అవి పూర్తిగా నిరాధారం.. అవాస్తవం. నా క్లయింట్ ద్వారా కొందరు వ్యక్తులు చేసిన వ్యాఖ్యల ద్వారా మీరు, మీ కుటుంబసభ్యులు ఆవేదన చెందామని, క్షోభకు గురయ్యామని వ్యాఖ్యానించారు.

మీరు చేసిన అసంబద్ధమైన, అనుచితమైన వ్యాఖ్యలకు నా క్లయింట్ కూడా తీవ్ర ఆవేదనకు గురయ్యారు. సత్ప్రవర్తనతో సుపరి పాలనను ప్రజలకు అందిస్తాననే హామీతో మీరు రాజకీయాల్లోకి వచ్చారు. అటువంటప్పుడు ఇతర రాజకీయ నాయకులలా మీరు కూడా నిరాధార ఆరోపణలు చేస్తే మీకు, వారికి మధ్య తేడా ఏముంటుంది? నా క్లయింట్ గురించి మీకు తెలిసి ఉండకపోవచ్చు, అందుకే, ఆయనపై లేనిపోని నిందారోపణలు మీ ట్వీట్స్ ద్వారా చేశారు.

నా క్లయింట్.. అదే.. మిస్టర్ శ్రీనిరాజు.. గత పద్దెనిమిదేళ్లుగా వెంచర్ క్యాపిటల్ బిజినెస్ నిర్వహిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు కంపెనీల్లో నా క్లయింట్ ఎన్నో ఇన్వెస్ట్ మెంట్స్ చేశారు. ఎన్నో ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్ బీ), ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ, హైదరాబాద్), ఐఐఐటీ శ్రీ సిటీ, చిన్మయా మిషన్ కు చెందిన రెండు హై స్కూల్స్ కు డొనేట్ చేశారు. ఇనిస్టిట్యూషనల్ ఫండ్ కింద అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ నిర్వహించే టీవీ 9 సంస్థలో వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసింది...  మేనేజ్ మెంట్ ఆఫ్ కంపెనీస్ వ్యవహారాల్లో వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ పార్టిసిపేట్ చేయట్లేదు.

నా క్లయింట్ ఈ నోటీసు ద్వారా ఏమి చెప్పదలచుకున్నారంటే.. నిజాయతీకి మారుపేరు. ప్రజల కోసం అంకితభావంతో పాటుపడే ఆయన పేరిట చేసిన ఆరోపణల ట్వీట్స్ ను తొలగించాలని కోరుకుంటున్నారు. ఈ నోటీసుకు అనుగుణంగా మీరు వ్యవహరించడంలో విఫలమైతే న్యాయపరంగా సరైన చర్యలు తీసుకునే హక్కు నా క్లయింట్ కు ఉంది’ అని ఆ నోటీసులో శ్రీనిరాజు తరపు న్యాయవాది సునీల్ రెడ్డి పేర్కొన్నారు.

More Telugu News